ETV Bharat / international

చైనాకు తైవాన్​ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు డ్రాగన్ డ్రోన్లు పరార్!

author img

By

Published : Aug 31, 2022, 6:30 PM IST

america taiwan china news
చైనాకు తైవాన్​ స్ట్రాంగ్ వార్నింగ్.. డ్రోన్లపై తూటాల వర్షం

China Taiwan drone : అమెరికా ప్రతినిధులసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ రాక తర్వాత కవ్వింపు చర్యలు పెంచిన చైనాకు తైవాన్‌ కూడా దీటుగానే బదులిస్తోంది. తాజాగా తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న చైనా డ్రోన్లపై కాల్పులు జరిపింది. రెచ్చగొట్టే చర్యలకు దిగితే అదేస్థాయిలో ప్రతిచర్యలు కూడా ఉంటాయని గట్టి సంకేతాలు పంపింది. డ్రోన్లను తిప్పికొట్టే వ్యవస్థలను బలోపేతం చేయటంపై దృష్టి సారించిన తైవాన్‌కు.. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా కూడా భారీ రక్షణ ప్యాకేజీ అందజేయనుంది.

China Taiwan attack news : తైవాన్‌, చైనా మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తీర ప్రాంతానికి వెలుపల తమ ఔట్‌పోస్టులపై ఎగురుతున్న డ్రాగన్‌ డ్రోన్లపై తైవాన్‌ కాల్పులు జరిపింది. కవ్వింపు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తామనే సంకేతాలను చైనాకు పంపింది. కిన్‌మెన్‌ ద్వీప సమూహాలపై డ్రోన్లను గుర్తించి.. కాల్పులు జరిపినట్లు తైవాన్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అవి మానవరహిత డ్రోన్లు అని పేర్కొంది. అయితే డ్రోన్లకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడించలేదు. తమ కాల్పుల తర్వాత డ్రాగన్‌ డ్రోన్లు.. చైనా సిటీ జియామెన్‌కు తిరిగి వెళ్లినట్లు తైవాన్‌ సైన్యం తెలిపింది.

ఈ నెలారంభంలో సముద్రంలోకి చైనా క్షిపణి దాడులు, తైవాన్ జలసంధి సమీపానికి యుద్ధ విమానాలు, నౌకలు పంపిన తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి సారథ్యంలో ఉన్నత స్థాయి బృందం 25 ఏళ్ల తర్వాత తైవాన్‌లో అడుగుపెట్టగా.. చైనా ప్రతీకార చర్యలకు దిగింది. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమని పేర్కొన్న చైనా.. ఇటీవలి చర్యలు దిగ్బంధం లేదా దండయాత్రకు రిహార్సల్‌గా అభివర్ణించింది. అయితే బీజింగ్‌ సైనిక విన్యాసాలను అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ తీవ్రంగా ఖండించాయి. చైనా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్‌ సమీపంలోని ప్రత్యేక ఆర్థిక జోన్‌ సముద్ర జలాల్లో పడ్డాయి. తమను బెదిరించాలని చైనా జరిపిన సైనిక విన్యాసాలు విఫలమైనట్లు తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది.

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌ కూడా రక్షణ శాఖకు కేటాయింపులు పెంచటంపై దృష్టి పెట్టింది. డ్రోన్‌ నిరోధక వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో.. వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్‌ను 12.9శాతం పెంచనున్నట్లు తైవాన్ అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది కేటాయించిన 415బిలియన్‌ తైవాన్‌ డాలర్లకు అదనంగా మరో 47.5 బిలియన్ల తైవాన్ డాలర్లు ఖర్చు చేయనుంది.

America Taiwan relations : అమెరికా కూడా రక్షణపరంగా తైవాన్‌కు దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. చైనా దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకుగాను నౌకలతోపాటు గగనతలంలోని లక్ష్యాల ఛేదించే క్షిపణులతో కూడిన 1.1బిలియన్‌ డాలర్ల తైవాన్‌ రక్షణ ప్యాకేజీ ఆమోదానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే అత్యాధునిక ప్రాసెసర్‌ చిప్స్‌ సరఫరాలో.. తైవాన్‌ వాటా సగానికిపైగా ఉంది. సైనిక విన్యాసాల్లో భాగంగా డ్రాగన్‌ జరిపిన క్షిపణీ దాడులతో జల, వాయు ట్రాఫిక్‌తోపాటు చిప్స్‌ ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.