ETV Bharat / international

షాక్‌ థెరపీలతో ఉద్యమకారులకు చైనా చిత్రహింసలు

author img

By

Published : Aug 17, 2022, 6:38 PM IST

హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులను చైనా అణచివేస్తోందని మాడ్రిడ్‌కు చెందిన ఎన్‌జీవో సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ ఆరోపణలు చేసింది. వారిని మానసిక చికిత్సాలయాల్లో బంధించి చిత్రహింసలు పెడుతోందని పేర్కొంది. ఆ చికిత్సాలయాల్లో డాక్టర్లు, వైద్యశాఖలోని అధికారులు కూడా ఇలాంటి క్రూర చర్యలకు పూర్తిగా సహకరిస్తున్నారని వివరించింది.

china
China

హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులను చైనా ఘోరంగా అణచివేస్తోందని మాడ్రిడ్‌కు చెందిన ఎన్‌జీవో సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఉద్యమకారులను మానసిక చికిత్సాలయాల్లో బంధించడం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. అక్కడ డాక్టర్లు, వైద్యశాఖలోని అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తారని వివరించింది. ‘అంకాంగ్‌’( చైనాలో మానసిక చికిత్సాలయాలను పిలిచే పేరు)లను చైనా దశాబ్దాల తరబడి రాజకీయ ఖైదీలను శిక్షించేందుకు వాడుతోంది. 2010లో కొన్ని సంస్కరణలు చేసి మానసిక చికిత్సాలయాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోకి తెచ్చినా పెద్దగా మార్పులు రాలేదు.

చాలా వరకు డేటా బాధితులను, బాధిత కుటుంబాలను నేరుగా ఇంటర్వ్యూలు చేసి ఈ నివేదికలో సమాచారాన్ని సేకరించారు. చైనాకు చెందిన ఎన్‌జీవో సివిల్‌ రైట్స్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ వాచ్‌ (సీఆర్‌ఎల్‌డబ్ల్యూ) ఈ ఇంటర్వ్యూలు చేసింది. 2015-21 మధ్యలో కనీసం 99 మంది ఉద్యమకారులను రాజకీయ కారణాలతో సైకోథెరిపిక్‌ సెంటర్లకు తరలించనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022లో కూడా తరచూ సీసీపీ రాజకీయ శత్రువులు సైకోథెరిపిక్‌ కేంద్రాల్లో దర్శనమిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యర్థులను అసలు న్యాయవ్యవస్థ వద్దకు కూడా వెళ్లనీయకుండా చేయడంలో సఫలమైందని సేఫ్‌గార్డ్‌ నివేదిక వివరించింది. మానసిక ఆరోగ్యం సరిగా లేదని వైద్య నివేదికలను సృష్టిస్తుందని వెల్లడించింది. చికిత్స తర్వాత కూడా వారు సమాజంలో ఏకాకులుగా మిగిలిపోతారని తెలిపింది. ఉద్యమకారులను బలవంతంగా ఆసుపత్రుల్లో చేర్చడంలో, చికిత్స చేయడంలో వైద్యశాలలు, డాక్టర్లు సీసీపీతో కుమ్మక్కై పనిచేస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ రాజకీయ ఖైదీలను కొట్టడం, విద్యుత్‌షాక్‌ థెరపీలు, ఒంటరిగా ఉంచడం వంటివి చేస్తారు. అధ్యక్షుడి చిత్రంపై రంగుపోయడం, సైన్యంలో గాయానికి పరిహారం కోరడం వంటివి చేసిన వారిని కూడా ఈ కేంద్రాలకు తరలించడం సీసీపీ క్రూరత్వాన్ని తెలియజేస్తోంది.

ఇదీ చూడండి:

ఆ భయంతో యువ జంటలకు చైనా సబ్సిడీలు, పన్ను రాయితీలు

భారత్​ అభ్యంతరాలు బేఖాతరు, శ్రీలంకకు చైనా నిఘా నౌక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.