ETV Bharat / international

ఆ భయంతో యువ జంటలకు చైనా సబ్సిడీలు, పన్ను రాయితీలు

author img

By

Published : Aug 17, 2022, 9:20 AM IST

china child policy చైనాను జననాల రేటు కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

china child policy change
china child policy change

china child policy: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రస్తుతం.. తగ్గిపోతోన్న జననాల రేటుతో కలవరపడుతోంది. 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దేశ జనాభా పెంచేందుకు డ్రాగన్‌ ముమ్మర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా పెంపు చర్యలపై వ్యయాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలకు సూచించింది.

'స్థానిక ప్రభుత్వాలు జనాభా పెంపు చర్యలను క్రియాశీలకంగా అమలు చేయాలి. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు, మెరుగైన ఆరోగ్య బీమా అందజేయాలి. విద్య, గృహవసతి, ఉపాధి కల్పనకు మద్దతు అందించాలి. పిల్లల సంరక్షణ సేవల కొరతను తగ్గించేందుకుగానూ.. ఈ ఏడాది చివరి నాటికి చిన్నారుల కోసం తగినన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలి' అని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. అధిక సంతానం దిశగా మహిళలను ప్రోత్సహించేందుకుగానూ ఇప్పటికే ఇక్కడి సంపన్న నగరాలు.. వారికి పన్ను రాయితీలు, గృహ రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలనూ అందజేస్తున్నాయి. ఇటువంటి చర్యలను అమలు చేసేందుకు అన్ని ప్రావిన్సులూ ముందుకు రావాలని కోరింది.

క్షీణిస్తున్న శ్రామిక శక్తి, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, తగ్గిన జనాభా వృద్ధిరేటు తదితర కారణాలతో చైనా ప్రస్తుతం జనాభా సంక్షోభంతో పోరాడుతోంది. 2016లోనే 'ఒకే బిడ్డ' నిబంధనకు స్వస్తిపలికిన చైనా.. గతేడాది ముగ్గురు పిల్లల విధానానికి అనుమతించింది. అయినప్పటికీ.. గత ఐదేళ్లలో జననాల రేటు పడిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వివరాల ప్రకారం.. చైనా జననాల రేటు గత ఏడాది ప్రతి వెయ్యి మందికి 7.52కు పడిపోయింది. 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' ఏర్పడిన 1949 నుంచి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడటం, జీవన వ్యయాలు పెరగడం, సాంస్కృతిక మార్పులు దీనికి కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి: భారత్​ అభ్యంతరాలు బేఖాతరు, శ్రీలంకకు చైనా నిఘా నౌక

ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.