ETV Bharat / international

ప్రపంచంపై మరో పిడుగు.. 48వేల ఏళ్ల నాటి 'జాంబీ వైరస్'​ వెలికితీత.. మహమ్మారిగా మారే ఛాన్స్!

author img

By

Published : Nov 30, 2022, 11:00 AM IST

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచంపై మరో పిడుగు! రష్యాలో 48,500 ఏళ్ల నాటి ఓ వైరస్​ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో పాటు మరిన్ని ప్రాణాంతక బ్యాక్టీరియాలను కనుగొన్నారు. ఇవి అంటువ్యాధులుగా మారి.. ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

old-zombie-virus-revived-by-scientists-in-russia
old-zombie-virus-revived-by-scientists-in-russia

కరోనాతో అల్లాడిన ప్రపంచానికి మరో వైరస్ పాండమిక్ రూపంలో దాడి చేస్తుందేమోనన్న భయాలు మొదలయ్యాయి. రష్యాలో 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్​ను ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు బయటకు తీయడం ఈ ఆందళనలకు కారణమవుతోంది. రష్యాలో గడ్డకట్టిన ఓ సరస్సు అడుగు భాగాన ఉన్న వైరస్​ను శాస్త్రవేత్తలు బయటకు తీసినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. గుర్తుతెలియని ఈ వైరస్​ వల్ల ఏవైనా వ్యాధులు సంక్రమిస్తాయేమోనని, వైరస్​ను వెలికితీయడం ప్రమాదకరంగా పరిణమిస్తుందేమోనని కథనంలో పేర్కొంది.

"గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉత్తరార్ధగోళంలో గడ్డకట్టిన మంచు కరిగిపోతోంది. లక్షల సంవత్సరాల క్రితం అంతరించి మంచులో చిక్కుకుపోయిన ఆర్గానిక్ పదార్థాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అందులో ప్రాణాంతక బ్యాక్టీరియాలు కూడా ఉండొచ్చు. పునరుజ్జీవం పొందిన సూక్ష్మజీవులు, పూర్వ చారిత్రక యుగం నుంచి నిద్రాణంలో ఉన్న వైరస్​లు కూడా ఆర్గానిక్ పదార్థాల్లో ఉన్నాయి."
-శాస్త్రవేత్తలు

జాంబీ వైరస్​లుగా పరిగణిస్తున్న వీటిలో కొన్నింటిపై శాస్తవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందులో పురాతనమైన వైరస్​ను 'పండోరావైరస్ యెడోమా'గా గుర్తించారు. దీన్ని 48,500 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. మంచులో గడ్డకట్టుకుపోయి తిరిగి సాధారణ స్థితికి వచ్చిన వైరస్​లలో ఇదే అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్నారు.ఇది ఇతర జీవులకూ సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

2013లో ఇదే శాస్త్రవేత్తలు 30వేల ఏళ్ల నాటి వైరస్​ను గుర్తించారు. ఇది కూడా సైబీరియాలోనే బయటపడటం గమనార్హం. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు 13 వైరస్​ల గురించి వివరించారు. ఒక్కో వైరస్​.. ఒక్కో జీనోమ్ కలిగి ఉందని చెప్పారు. పాండోరావైరస్ రష్యాలోని యకుటియాలో ఉన్న యూకెచీ అలాస్ సరస్సు అడుగున గుర్తించారు. మిగిలిన వైరస్​లలో కొన్నింటిని మామోత్ జంతువుల బొచ్చు, సైబీరియా తోడేలు పేగులలో కనుగొన్నారు.

ఈ జాంబీ వైరస్​లకు అంటువ్యాధులుగా మారే సత్తా ఉందని, కాబట్టి ఇది వైద్యపరమైన ప్రమాదానికి ఇది సంకేతమని పరిశోధకులు హెచ్చరించారు. మంచులో గడ్డకట్టిన ఆర్గానిక్ పదార్థాలు బయటకు రావడం వల్ల.. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు బయటకు వస్తాయని, ఇది గ్రీన్​హౌస్ ఎఫెక్ట్​ను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ధృవప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతుందని, తద్వారా మరిన్ని వైరస్​లు బయటకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇది విషవలయంగా మారుతుందని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.