ETV Bharat / international

'ఒమిక్రాన్'తో ఆ దేశాలు హడల్.. ఆఫ్రికా ప్రయాణికులపై ఆంక్షలు

author img

By

Published : Nov 28, 2021, 7:39 PM IST

Omicron variant
Omicron variant

కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్(Omicron virus news).. మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇద్దరికి, నెదర్లాండ్స్​లో 13 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ భయాల నేపథ్యంలో వివిధ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే, తమ పౌరులపై అన్ని దేశాలు ఒక్కసారిగా ఆంక్షలు విధించడం సరికాదని దక్షిణాఫ్రికా పేర్కొంది.

వ్యాక్సినేషన్​తో కొవిడ్​పై విజయవంతంగా పోరాడుతున్న ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant covid) భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు బయటపడ్డ వేరియంట్లతో పోలిస్తే వ్యాప్తి రేటు అధికంగా ఉన్న ఈ వైరస్​ను నియంత్రించేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు (Omicron travel restrictions) విధిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా సహా పొరుగున ఉన్న 9 దేశాల ప్రయాణికులపై ఆంక్షలు (Omicron travel bans) అమలులోకి తెచ్చినట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ తొమ్మిది ఆఫ్రికా దేశాల్లో నివసించే న్యూజిలాండ్ పౌరులకు మాత్రమే దేశంలోకి అనుమతి ఉంటుందని న్యూజిలాండ్ కరోనా విపత్తు స్పందన శాఖ మంత్రి క్రిస్ హిప్కిన్స్ తెలిపారు. వీరు కూడా సైన్యం నిర్వహించే క్వారంటైన్ కేంద్రాల్లో రెండు వారాల పాటు గడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ న్యూజిలాండ్​లోకి ప్రవేశించలేదనే అధికారులు భావిస్తున్నారని చెప్పారు.

ఇతర దేశాల్లో...

  • జపాన్ సైతం సరిహద్దులో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలను చేపట్టింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింత విస్తృతం చేయనున్నట్లు ప్రకటించింది.
  • పర్యటక ఆధారిత థాయ్​లాండ్ సైతం ఎనిమిది ఆఫ్రికా దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
  • ఏడు ఆఫ్రికా దేశాల్లో ఇటీవల పర్యటించిన వారిని దేశంలోకి అనుమతించకుండా సింగపూర్ ఆంక్షలు అమలులోకి తెచ్చింది.
  • ఇజ్రాయెల్ సైతం విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది. 50 ఆఫ్రికా దేశాలకు చేసే ప్రయాణాలపై ఆంక్షలు అమలులోకి తెచ్చింది. ఒమిక్రాంట్ వేరియంట్ కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం వివాదాస్పద ఫోన్ మానిటరింగ్ టెక్నాలజీ ఉపయోగానికి ఆమోదం తెలిపింది. దీనిపై మానవహక్కుల ఉద్యమకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఈ నిర్ణయం ఉందని ఆరోపిస్తున్నారు.

కేసులు పెరుగుతున్నాయ్..

ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్న దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాల్లో కొత్త వేరియంట్ కేసులను ఇదివరకే గుర్తించగా.. తాజాగా ఆస్ట్రేలియాలో కొత్త వేరియంట్ కేసులు (Omicron in which countries) బయటపడ్డాయి.

  • నెదర్లాండ్స్​లో 13 ఒమిక్రాన్ (Netherlands Omicron) కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నమోదైన 61 కేసులకు ఇవి అదనం. విమాన ప్రయాణాలు నిషేధించక ముందు దేశంలోకి వచ్చిన వారిలో ఈ కేసులు గుర్తించారు అధికారులు. వీరిని వెంటనే ఐసోలేషన్​కు పంపించారు.
  • ఆస్ట్రేలియాలో ఇద్దరు అంతర్జాతీయ ప్రయాణికులకు ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. వీరిద్దరూ ఆఫ్రికా నుంచే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
  • గత రెండు వారాల్లో దేశానికి వచ్చిన ప్రయాణికుల జాబితాను ఇటలీ పరిశీలిస్తోంది. మొజాంబిక్ నుంచి రోమ్​కు వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించి.. వైరస్ వ్యాప్తిని గుర్తించే పనిలో పడింది.
  • అమెరికాలో ఈ వేరియంట్ కేసు బయటపడకపోయినప్పటికీ.. ఒమిక్రాంట్ దేశంలోకి చొరబడే ఉంటుందని ఆ దేశ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

కట్టుదిట్టమైన చర్యలు..

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది బ్రిటన్. దుకాణాలు, ప్రయాణాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. రెండు కేసులు బయటపడినందున టెస్టింగ్​ను వేగవంతం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలు సేకరించి పరీక్షిస్తోంది. ఇప్పటికే ఆరు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. తాజాగా మరో నాలుగు దేశాలను ఆ జాబితాలోకి చేర్చింది.

వ్యాక్సిన్ తీసుకున్నవారికీ ఒమిక్రాన్..

ఇంగ్లాండ్​కు వచ్చిన వారు రెండు రోజుల తర్వాత కొవిడ్ పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలితే.. సన్నిహిత వ్యక్తులు 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

"కొత్త వేరియంట్ గురించి మనకు ఇప్పుడే పూర్తి వివరాలు తెలియదు. మన సైంటిస్టులు దీని గురించి తెలుసుకుంటున్నారు. అయితే, ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

ఆంక్షలు తొందరపాటే: దక్షిణాఫ్రికా

తమ పౌరులపై అన్ని దేశాలు మూకుమ్మడిగా ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా (south africa omicron variant) ఖండించింది. ఒమిక్రాన్ భయాలతో ఇప్పటికే 18 దేశాలు దక్షిణాఫ్రికా ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్మన్ ఏంజెలిక్ కోట్జీ.. వైరస్​పై పూర్తి అవగాహన లేకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటేనని అన్నారు. ఒమిక్రాన్ రోగుల లక్షణాలు బీటా వేరియంట్​కు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. కొంతమందికి వైరస్ పరీక్షల్లో ఒమిక్రాన్ లక్షణాలు బయటపడకపోవడానికి ఇది కారణమై ఉండొచ్చన్నారు. వైరస్​ను గుర్తించేందుకు తమ శాస్త్రవేత్తలు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో తమ దేశాన్ని అభినందించాల్సింది పోయి.. వేలెత్తి చూపడం భావ్యం కాదని అన్నారు.

స్విట్జర్లాండ్ ఓటింగ్

వ్యాక్సినేషన్ పూర్తైన వ్యక్తులు, కరోనా నెగెటివ్​గా తేలిన వారికి ప్రత్యేక కొవిడ్ ధ్రువపత్రాలు జారీ చేయాలని చేసిన ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ప్రత్యేక సర్టిఫికేట్ల జారీతో పాటు కార్మికులకు సహాయం అందించేలా చట్టాన్ని రూపొందించారు. దీనికి అనుకూలంగా 63 శాతం మంది ప్రజలు ఓటేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటింగ్​ నిర్వహించడం గమనార్హం.

ఆందోళనకర వేరియంట్

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్​ను ఆందోళనకర వేరియంట్​గా డబ్ల్యూహెచ్ఓ వర్గీకరించింది. ఏ వేరియంట్​లోనూ లేని విధంగా ఒమిక్రాన్​లో 32 మ్యూటేషన్లు ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా ఇది ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వేరియంట్​ను గ్రీకు వర్ణమాలలోని 15వ అక్షరమైన 'ఒమిక్రాన్' పేరుతో పిలుస్తోంది డబ్ల్యూహెచ్​ఓ.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.