ETV Bharat / international

'ముందుంది గడ్డు కాలం- 2021 మరింత కఠినం'

author img

By

Published : Nov 15, 2020, 12:39 PM IST

Updated : Nov 15, 2020, 4:05 PM IST

వచ్చే ఏడాది మరింత కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే హెచ్చరించారు. తమ సంస్థకు నోబెల్ రావడం వల్ల ఈ విషయంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసే అవకాశం లభించిందన్నారు. భారీగా నిధులు లేకపోతే తీవ్ర స్థాయి క్షామం ఏర్పడుతుందని, ఆదుకునేందుకు బిలియనీర్లు ముందుకురావాలని అభ్యర్థించారు.

Nobel UN agency warns 2021 is going to be worse than 2020
'ముందుంది గడ్డు కాలం- 2021 మరింత కఠినతరం'

నోబెల్ శాంతి బహుమతి లభించడం వల్ల ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసే అవకాశం తమకు లభించిందని ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్​పీ) చీఫ్ డేవిడ్ బీయాస్లే పేర్కొన్నారు. 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 మరింత కఠినంగా ఉంటుందని చెప్పేందుకు ఇదో మంచి అవకాశమని అన్నారు. నిధులు సంవృద్ధిగా లేకుంటే తీవ్రస్థాయి క్షామం ఏర్పడుతుందని హెచ్చరించారు.

"సంక్షోభాలు, సంఘర్షణల పరిస్థితుల్లో శరణార్థి శిబిరాల్లో మా సంస్థ చేసే పనులను నార్వే నోబెల్ కమిటీ పరిశీలించింది. లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించేందుకు సిబ్బంది తీసుకుంటున్న రిస్క్​ను గుర్తించింది. అదే సమయంలో, మరింత కఠినమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సందేశం ఇచ్చింది."

-డేవిడ్ బియాస్లే, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కరోనాతో పాటు ఆకలి సంక్షోభంపైనా ప్రభుత్వాలు పోరాడాలని సూచించారు బియాస్లే. సత్వర చర్యలు తీసుకోకపోతే.. కొద్ది నెలల్లోనే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని ఐరాస భద్రతా మండలికి చేసిన సూచనలను గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నందున 2021లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు.

"డబ్బు, ఉద్దీపన పథకాలు, రుణ వాయిదాల ద్వారా 2020లో సంక్షోభాన్ని ప్రపంచ నేతలు నివారించగలిగారు. కానీ కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు దిగజారుతున్నాయి. ముఖ్యంగా అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో పరిస్థితి తీవ్రమవుతోంది. మరోసారి లాక్​డౌన్​లు విధిస్తున్నారు. 2020లో అందుబాటులో ఉన్న డబ్బు 2021లో అందుబాటులో ఉండకపోవచ్చు. సంక్షోభాలు ఇప్పటితో పోలిస్తే వచ్చే 12-18 నెలల్లో అత్యంత తీవ్రంగా మారవచ్చు."

-డేవిడ్ బియాస్లే, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

'డబ్ల్యూఎఫ్​పీ'కి నోబెల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బియాస్లే. నోబెల్ రావడం వల్ల ప్రపంచ స్థాయి నేతలతో ఎక్కువసేపు చర్చించే అవకాశం లభించిందని చెప్పారు. చట్ట సభ్యులు, దేశాధినేతలతో వర్చువల్​గా సమావేశమవుతున్నట్లు తెలిపారు.

"నోబెల్ శాంతి బహుమతి గెలిచినవారిని ఇప్పుడు అందరూ కలవాలని అనుకుంటున్నారు. ఇదివరకు 15 నిమిషాలు సమయం ఉంటే ఇప్పుడు 45 నిమిషాలు లభిస్తోంది. వచ్చే ఏడాది పరిస్థితులు ఎంత కఠినంగా మారతాయి, ఎలాంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ నేతలకు సవివరంగా చెప్పేందుకు ఈ సమయం ఉపయోగపడుతోంది."

-డేవిడ్ బియాస్లే, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

నిధులు కావాలి

కరవు, ఆకలి, వలసలు, అస్థిర పరిస్థితులపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని సూచించారు బియాస్లే. వచ్చే ఏడాది డబ్ల్యూఎఫ్​పీకి 15 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సంక్షోభాలను నివారించేందుకే 5 బిలియన్ డాలర్లు కావాలని చెప్పారు. కొవిడ్ సంక్షోభ సమయంలో కోట్లు వెనకేసుకున్న బిలియనీర్లు అదనపు నిధుల కోసం సహాయం చేసేందుకు ముందుకు రావాలని అభ్యర్థించారు.

డబ్బు లేకపోతే కష్టమే

ఏప్రిల్​లో 13.5 కోట్ల మంది ప్రజలు ఆకలి సంక్షోభాన్ని, అంతకన్నా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు బియాస్లే. 2020 చివరి నాటికి మరో 13 కోట్ల మంది ప్రజలు ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. తగినంత నిధులు లేకపోతే సుమారు 36 దేశాలు క్షామంలో చిక్కుకుపోతాయని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని అంచనా వేశారు.

Last Updated : Nov 15, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.