ETV Bharat / international

టీకా మిక్సింగ్‌తో లాభమా? నష్టమా?

author img

By

Published : Jun 21, 2021, 2:34 PM IST

Mixing two vaccines
టీకా మిక్సింగ్‌

రెండు వేర్వేరు టీకాలు ఇవ్వటం వల్ల కొత్త రకాలపై వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వటం వల్ల జ్వరం, ఇతర దుష్ప్రభావాల తీవ్రత అధికంగా ఉన్నట్లు గమనించామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో నూతన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు వేర్వేరు కరోనా టీకాలను ఇవ్వడం(వ్యాక్సిన్‌ మిక్సింగ్‌) ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తితో పాటు కొత్త రకాల నుంచి రక్షనిచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వారికి మేలే..

దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పందించారు. రెండు వేర్వేరు టీకాలను ఇవ్వడం వల్ల కొత్త రకాలపై వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.

"ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇది ఒక అవకాశమనే చెప్పాలి. అయితే, యూకే, స్పెయిన్‌, జర్మనీ నుంచి లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం వల్ల జ్వరం, నొప్పి, సహా ఇతర దుష్ప్రభావాల తీవ్రత అధికంగా ఉన్నట్లు గమనించాం. అదే సమయంలో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే బలమైన రోగనిరోధక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందన్నట్లు తెలుస్తోంది."

-- సౌమ్యా స్వామినాథన్​, డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త

బూస్టర్‌.. తొందరపాటే!

మరోవైపు కొన్ని దేశాలు, ఔషధ సంస్థలు కొవిడ్‌ బూస్టర్‌ డోసుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడే బూస్టర్ డోసు గురించి ప్రణాళికలు వేసుకోవడం తొందరపాటు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు బూస్టర్‌ డోసును సిఫార్సు చేసేందుకు కావాల్సిన సమాచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదని స్వామినాథన్ స్పష్టం చేశారు. ఇంకా కరోనా వైరస్‌, వ్యాక్సిన్లకు సంబంధించిన శాస్త్రపరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ కొన్ని దేశాలు తొలి డోసు కూడా ఇవ్వలేదని.. ఈ తరుణంలో బూస్టర్ డోసు గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని స్పష్టం చేశారు.

బూస్టర్‌ డోసుపై యూకేలో ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దేశ జనాభాలో అత్యధిక మందికి టీకాలు అందజేసిన యూకే.. కొత్త వేరియంట్ల నుంచి తప్పించుకునేందుకు బూస్టర్ డోసు అవసరమని భావిస్తోంది. ఈ మేరకు ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇదీ చదవండి : ' రెండో దశలో కరోనా మరణాలు 15లక్షల కంటే అధికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.