ETV Bharat / international

Alpha, Beta: 90 ఏళ్ల వృద్ధురాలిలో రెండు వేరియంట్లు!

author img

By

Published : Jul 11, 2021, 5:26 PM IST

90 ఏళ్ల వృద్ధురాలిలో ఓకేసారి ఆల్ఫా, బీటా(Alpha, Beta) వేరియంట్లు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. కొవిడ్(Covid-19)​ కారణంగా ఆరోగ్యం క్షీణించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బెల్జియంలో జరిగింది.

Alpha, Beta
ఆల్ఫా-బీటా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి(Corona Virus) ఒక్కోవ్యక్తిలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు(Covid variants) విస్తృత వ్యాప్తి, ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వృద్ధురాలిలో ఓకేసారి ఆల్ఫా, బీటా(Alpha, Beta) వేరియంట్లు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలిలో ఈ రెండు రకాలు నిర్ధరణ అయినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోయినట్లు యూరోపియన్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నివేదిక వెల్లడించింది.

బెల్జియంలోని ఆల్ట్స్‌ నగరానికి చెందిన ఓ వృద్ధురాలి(90)కి కరోనా లక్షణాలు ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు జరిపిన పరీక్షల్లో ఆమెకు కొవిడ్‌-19 నిర్ధరణ అయ్యింది. తొలుత ఆక్సిజన్‌ స్థాయులు సరిపడా ఉన్నప్పటికీ ఐదు రోజుల అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె నమూనాలకు జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా.. ఆమెకు ఆల్ఫా, బీటా రెండు వేరియంట్లు సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అయితే, నర్సింగ్‌హోం సంరక్షణలో ఉన్న ఆ వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యులు గుర్తించారు.

రెండు వేర్వేరు ఇన్‌ఫెక్షన్‌లు సోకిన వ్యక్తుల నుంచి వృద్ధురాలికి ఈ వేరియంట్లు సోకి ఉండొచ్చని ఓఎల్​వీ(OLV) ఆస్పత్రి నిపుణురాలు అన్నే వంకీర్‌బర్గన్‌ పేర్కొన్నారు. కచ్చితంగా ఆమెకు రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుపట్టడం లేదన్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడానికి కో-ఇన్‌ఫెక్షన్‌ (ఒకేసారి రెండు వేరియంట్లు) కారణమని చెప్పడం కూడా కష్టమేనని అన్నారు. ఇలాంటి కేసులకు సంబంధించిన నివేదికలు ఇప్పటివరకు అందుబాటులో లేవని.. అయినప్పటికీ ఆ కోణంలో కేసులు నమోదు కావని చెప్పడం వాటిని తక్కువ అంచనా వేయడమేనన్నారు.

గతంలో బ్రెజిల్‌లోనూ..

ఒకేవ్యక్తిలో రెండు భిన్న వేరియంట్లు సోకిన సంఘటన జనవరి నెలలో బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఓకేసారి ఇద్దరి వ్యక్తుల్లో రెండు వేర్వేరు వేరియంట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చాలా అరుదుగా జరిగే ఇటువంటి కేసులకు సంబంధించిన పరిశోధనాత్మక సమాచారం మాత్రం ఇంతవరకు సైంటిఫిక్‌ జర్నల్‌లో అందుబాటులో లేదని యూనివర్సిటీ ఆఫ్ వార్‌విక్‌కు చెందిన లారెన్స్‌ యోంగ్‌ పేర్కొన్నారు. ఒకేసారి రెండు వేరియంట్లు వెలుగు చూడడం ఆశ్చర్యకర విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఇన్‌ఫ్లుయెంజా విషయంలో ఇటువంటి కేసులకు సంబంధించి రుజువులు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వేరియంట్ల నుంచి వ్యాక్సిన్‌లు ఏమేరకు రక్షణ కల్పిస్తాయనే విషయాన్ని తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేపట్టాలని అన్నారు. ఇదిలా ఉంటే, ఆల్ఫా వేరియంట్‌ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూడగా.. బీటా వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో బయటపడింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.