ETV Bharat / international

చైనాలోని ఆ మూడు నగరాల్లో మళ్లీ కరోనా వ్యాప్తి

author img

By

Published : Nov 23, 2020, 9:29 PM IST

చలికాలం ప్రభావంతో చైనాలోని మూడు నగరాల్లో కరోనా మళ్లీ విజృంభించింది. దీంతో అధికారులు ఆ నగరాల్లో లాక్​డౌన్​ విధించారు. విద్యాసంస్థల్ని మూసివేశారు. లక్షలమందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

virus again raised in china three cities
చైనాలోని ఆ మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి

చైనాలోని తియాన్జిన్​, షాంఘై, మంజౌలీ నగరాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఈ మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా షాంఘైలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నుంచి నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నగరంలోని పుదోంగ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 17,719మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తియాన్జిన్​లో గతవారం ఐదు కేసులు నమోదవటంతో ఆ ప్రాంతంలో దాదాపు 20లక్షల మందికి పైగా కొవిడ్​ టెస్టులు చేశారు. మంజౌలీలో శనివారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చైనాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,442గా ఉంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,634 మంది మరణించారు.

వరుసగా 16వరోజు తగ్గుదల

భారత్​లో వరుసగా 16వ రోజు కేసుల సంఖ్య 50వేల కంటే తక్కువగా నమోదైంది. దేశంలో కొత్తగా 44,059 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. కొత్తగా 511మంది కరోనాతో మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1,33,738గా ఉంది. ప్రస్తుతం భారత్​లో 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల్లో 4.85శాతం.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93శాతంగా ఉంది. మొత్తం రికవరీ కేసుల్లో దాదాపు 77.44 శాతం కేసులు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. కేరళ, దిల్లీ, మహారాష్ట్రలో రికవరీ రేటు అధికంగా ఉంది.

నిబంధనలు కఠినతరం

దక్షిణ కొరియాలో సోమవారం కొత్తగా 271 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్​ నిబంధనలను కఠినతరం చేసింది. నైట్​క్లబ్​లు, రెస్టారెంట్​లను మూసివేసింది. ప్రజారవాణాను రాత్రి 10గంటల వరకే అనుమతించింది.

ప్రజలు ఇంట్లో ఉండాల్సిందే

సింగపూర్​లో సోమవారం కొత్తగా ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. దేశం​లో మొత్తం 58,165 కరోనా కేసులు నమోదవగా, ఇప్పటివరకు 28మంది కరోనాతో మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.