ETV Bharat / international

తాలిబన్​ సర్కార్​కు గుర్తింపుపై అన్ని దేశాలదీ అదే కన్ఫ్యూజన్!

author img

By

Published : Sep 8, 2021, 7:00 PM IST

Updated : Sep 8, 2021, 7:22 PM IST

అఫ్గానిస్థాన్​ను(Afghan News) తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు(Afghan Taliban) ఇస్లామిక్ ఎమిరేట్​ పేరుతో తమ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేశారు. అయితే.. అంతర్జాతీయంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టడమే ఇప్పుడు వారి ముందున్న అతిపెద్ద సవాలు. మరి వీరి ప్రభుత్వాన్ని గుర్తించడంలో ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి? తాలిబన్లకు విదేశాలు అండగా నిలుస్తాయా?

taliban government
అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వం

అఫ్గానిస్థాన్​లో(Afghan News) తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని(Taliban Government) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ముల్లా మహమ్మద్​ హసన్​ అఖుంద్​ను ప్రధానమంత్రిగా నియమించారు. షరియా చట్టానికి(sharia rules) అనుగుణంగా పరిపాలిస్తామని తేల్చి చెప్పారు. అయితే.. ఇప్పుడు వీరి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా? లేదా? అన్నది అసలైన ప్రశ్న. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వంపై వివిధ దేశాల వైఖరి ఎలా ఉందంటే..?

చైనా సంగతేంటి?

అమెరికా వైదొలిగిన అనంతరం అఫ్గాన్​పై పట్టు సాధించేందుకు చైనా(China on Afghanistan) విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడి ఖనిజాలపై కన్నేసిన చైనా.. తాలిబన్లతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ క్రమంలో అఫ్గాన్​లో తాలిబన్ల​ ప్రభుత్వ ఏర్పాటుపై చైనా బుధవారం స్పందించింది. కొన్ని వారాలుగా సాగుతున్న అనిశ్చితికి తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టడం వల్ల ముగింపు దొరికిందని అభిప్రాయపడింది.

"తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరమైన చర్య. మూడు వారాలుగా అఫ్గాన్​లో నెలకొన్న అనిశ్చితికి తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల తెరపడింది. విస్తృతమైన రాజకీయ విధానాల్ని తాలిబన్లు పాటించాలని కోరుకుంటున్నాం. స్నేహపూరిత విదేశాంగ విధానాలను వారు అవలంబిస్తున్నారని ఆశిస్తున్నాం."

-వాంగ్​ వెన్​బిన్​, చైనా విదేశాంగ మంత్రి.

పాక్ వైఖరేంటి?

తాలిబన్లను వెనక నుంచి నడిపించి, వారు అధికారాన్ని చేజిక్కించుకునేలా పాకిస్థానే(Pakistan on Afghanistan) సాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాలిబన్ల ప్రభుత్వంపై పాకిస్థాన్​ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్నది కీలకంగా మారింది. అయితే.. అఫ్గాన్​ పరిస్థితులపై చర్చించడానికి పొరుగు దేశాలతో పాకిస్థాన్​ బుధవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. చైనా, ఇరాన్, తజికిస్థాన్​, తుర్కెమిస్థాన్​, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్చువల్​ భేటీకి పాక్​ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అధ్యక్షత వహించారు.

సుదీర్ఘ యుద్ధాన్ని చవిచూసిన అఫ్గాన్​లో పరిస్థితులు ఇంకా క్లిష్టంగానే ఉన్నాయని ఖురేషీ తెలిపారు. అయితే.. తాలిబన్లపై గతంలో ఏర్పరుచుకున్న అభిప్రాయాలను వీడి, నూతన వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

"మానవతా సంక్షోభాన్ని అడ్డుకుని, అఫ్గాన్​ను ఆర్థికపరంగా అఫ్గాన్​ను గట్టెక్కించడమే ఇప్పుడు ప్రధానమైన అంశం. ఈ దిశగా అఫ్గాన్​లో శాంతి నెలకొల్పేందుకు భేటీలో పాల్గొన్న దేశాలు అంగీకరించాయి" అని ఖురేషీ పేర్కొన్నారు.

అమెరికా ఏమంటోంది?

తాలిబన్ల ప్రభుత్వం కదలికల్ని తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. తాలిబన్ల చర్యల ఆధారంగా వారి ప్రభుత్వాన్ని గుర్తించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

"తాలిబన్లు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న విషయం మేం అర్థం చేసుకోగలం. అయితే.. వారి ప్రభుత్వాన్ని మాటల ద్వారా కాకుండా వారి చర్యల ద్వారా నిర్ణయిస్తాం. అఫ్గాన్​ పౌరులు సమ్మిళిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేం ఎప్పుడో స్పష్టం చేశాం."

-అమెరికా విదేశాంగ శాఖ

అఫ్గాన్ గడ్డ ఇతర దేశాలకు సమస్యలా మారకుండా తాలిబన్లు వ్యవహరిస్తున్నారని ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.

జర్మనీ మాటేమిటి?

అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వ గుర్తింపుపై జర్మనీ కీలక వ్యాఖ్యలు చేసింది. అఫ్గాన్​కు మానవతా సాయాన్ని అందించేందుకు తాము ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రయత్నిస్తామని తెలిపింది.

"ఐక్యరాజ్య సమితి ద్వారా తాలిబన్ల ప్రభుత్వానికి మానవతా సాయాన్ని అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అఫ్గానిస్థాన్​ నుంచి మా ఉద్యోగులు, ఇతర పౌరుల తరలింపు విషయంలో తాలిబన్లతో మేం చర్చలు కొనసాగిస్తాం."

-హైకో మాస్​, జర్మనీ విదేశాంగ మంత్రి.

తాలిబన్ల ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటులో అన్ని వర్గాల ప్రాధాన్యమిచ్చినట్లుగా కనపడలేదని హైకో మాస్ అభిప్రాయపడ్డారు. కాబుల్​లో మంగళవారం మహిళలు, పాత్రికేయులపై జరిగన దాడిని బట్టి చూస్తే.. అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వంపై ఆశలు లేవని అన్నారు.

భారత్, రష్యా​ ఏం చేయనున్నాయి?

అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ బుధవారం​ దిల్లీలో సమావేశమయ్యారు. అమెరికా సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్​ విలియమ్ బర్న్స్​ భేటీ అయిన ఒక్కరోజు తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అఫ్గాన్​ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రష్యా, భారత్​ తీర్మానించాయి.

ఇదీ చూడండి: తాలిబన్లకు ఆ మార్కెట్​ అండ- అందుకే అమెరికా ఆంక్షలు బేఖాతర్!

ఇదీ చూడండి: Taliban 2.0: 'డిగ్రీ, పీహెచ్​డీ వేస్ట్- మహిళలకు ఆటలు అనవసరం'

Last Updated : Sep 8, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.