ETV Bharat / international

అఫ్గాన్​ విషయంలో భారత్​, రష్యా కీలక నిర్ణయం

author img

By

Published : Sep 8, 2021, 5:47 PM IST

russia and india meeting on afghan
అఫ్గాన్​ విషయంలో భారత్​, రష్యా కీలక నిర్ణయం

అఫ్గాన్​ విషయంలో రష్యా, భారత్​ సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ బుధవారం దిల్లీలో చర్చించారు. అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వ గుర్తింపుపై ఆచితూచి వ్యవహరించాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్​ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ దిల్లీలో సమావేశమయ్యారు. అమెరికా సెంట్రల్​ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్​ విలియమ్ బర్న్స్​ భేటీ అయిన ఒక్కరోజు తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం.

అఫ్గాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం సహా దక్షిణాసియాలో జైష్​-ఏ -మహమ్మద్​, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై నికోలాయ్​, అజిత్​ డోభాల్​ చర్చించారని సంబంధింత వర్గాలు తెలిపాయి. అయితే.. అఫ్గాన్ విషయంలో.. సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వ్యతిరేక పోరాటంలో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

"అఫ్గాన్​లో మానవతా పరిస్థితులపై, పౌరుల తరలింపుపై రష్యా, భారత్​ ప్రతినిధులు చర్చించారు. శాంతియుత మార్గంలో అఫ్గాన్​లోని సమస్యలను పరిష్కరించడానికి రష్యా, భారత్​ కలిసి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్​ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు."

-రష్యా రాయబార కార్యాలయం.

మరోవైపు.. జనరల్‌ నికోలాయ్‌ పాట్రూషెవ్‌ అజిత్​ డోభాల్​తో కలిసి.. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌తోనూ భేటీ కానున్నారు. అఫ్గాన్​లో రాజకీయ, భద్రతా పరమైన, మానవతా పరిస్థితులను వారు సమీక్షించనున్నారు.

ఆగస్టు 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ సంభాషణ తర్వాత రష్యా ప్రతినిధి నికోలాయ్​ ఎన్​ఎస్​ఏ అజిత్​ డోభాల్​ మధ్య ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే.. మంగళవారం డోభాల్​, అమెరికా సీఐఏ చీఫ్​ మధ్య జరిగిన చర్చపై భారత విదేశాంగ శాఖ, అమెరికా దౌత్య కార్యాలయం స్పందించలేదు.

మరోవైపు.. అఫ్గాన్​లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. వారి చర్యల ఆధారంగా.. అఫ్గాన్​లో వారి ప్రభుత్వాన్ని గుర్తించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.