ETV Bharat / international

క్రియాశీల రాజకీయాల్లోకి నవాజ్​ షరీఫ్ పునరాగమనం​!

author img

By

Published : Sep 19, 2020, 4:14 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​.. ఏడాది తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా? తమ పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు కసరత్తు చేపట్టారా? అంటే అవుననే చెప్పాలి. అందులో భాగంగానే ఆయన ఆదివారం నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హారుకానున్నట్లు తెలుస్తోంది.

Pak's ex-PM Sharif
క్రియాశీల రాజకీయాల్లోకి నవాజ్​ షరీఫ్ పునరాగమనం​!

పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​ రాజకీయ పునరాగమనం చేయనున్నారు. రెండేళ్ల తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్​ ఖాన్​ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించే లక్ష్యంతో ఆదివారం నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్చువల్​గా హాజరుకావాలని షరీఫ్​ను ఆహ్వానించారు పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ (పీపీపీ) ఛైర్మన్​ బిలవాల్​ బుట్టో జర్దారీ.

ఈ నెల 18న షరీఫ్​తో ఫోన్​లో మాట్లాడారు పీపీపీ ఛైర్మన్​ జర్దారీ. ఆదివారం నిర్వహించ తలపెట్టిన విపక్షాల సమావేశానికి వర్చువల్​గా హాజరుకావాలని ఆహ్వానించారు. ఇమ్రాన్​ ప్రభుత్వం ధరల పెరుగుదల, పేదరికాన్ని అరికట్టటంలో విఫలమైనట్లు ఆరోపించారు.

" ఇప్పుడే నవాజ్​ షరీఫ్​తో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నా. సెప్టెంబర్​ 20న పీపీపీ నేతృత్వంలో నిర్వహించే విపక్షాల సమావేశానికి వర్చువల్​గా హాజరుకావాలని ఆహ్వానించా."

- బిలవాల్ బుట్టో జర్దారీ​, పీపీపీ ఛైర్మన్​

మరియం కృతజ్ఞతలు..

షరీఫ్​ను ఆహ్వానించటం పట్ల పీపీపీ ఛైర్మన్​ బిలవాల్​కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన కూతురు మరియం​. అయితే..పాకిస్థాన్​ ముస్లిం లీగ్​-నవాజ్​ (పీఎంఎల్​-ఎన్)​ పార్టీ ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, షరీఫ్​ వర్చువల్​గా హాజరవుతారని పార్టీ సెనేటర్​ ముసదిక్​ మలిక్​ ఓ మీడియా సంస్థతో తెలిపారు. మరియం నవాజ్​ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు.

విపక్షాల అత్యన్నత స్థాయి సమావేశానికి హాజరవటం వల్ల షరీఫ్​ పార్టీ పీఎంఎల్​-ఎన్​ను పునరుజ్జీవనం చేయటం సహా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మరింత ఆజ్యం పోసినట్లవుతుంది. అయితే... షరీఫ్​పై నాన్​బెయిలేబుల్​ అరెస్ట్​ వారెంట్​​ జారీ చేసిన క్రమంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండు కేసుల్లో బెయిల్​పై..

అవెన్​ఫీల్డ్​ ఆస్తుల కేసులో.. షరీఫ్​తో పాటు ఆయన కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్​లపై 2018, జులై 6న కేసు నమోదైంది. 2017లో ప్రధాని పదవి కోల్పోయిన ఆయనకు..ఆల్​ అజీజ్​ స్టీల్​ మిల్స్​ కేసులో ఏడేల్ల శిక్ష పడింది. ఈ రెండు కేసుల్లో బెయిల్​ పొందిన ఆయన ఎనిమిది వారాల చికిత్స నిమిత్తం లండన్​ వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగానే స్వదేశానికి రాలేకపోతున్నట్లు ఆయన న్యాయవాది తెలిపారు.

ఇదీ చూడండి: పాక్​ మాజీ ప్రధాని​పై అరెస్ట్​ వారెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.