ETV Bharat / international

'బాయ్‌కాట్‌ 996'.. చైనాలో కొత్త ఉద్యమం

author img

By

Published : Oct 16, 2021, 4:48 AM IST

ఓవర్‌టైం పనివేళలు, వీక్‌ ఆఫ్స్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ చైనాలోని ఉద్యోగులు ఆన్​లైన్​ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు.. తాము పనిచేస్తున్న పనివేళల వివరాలను ఆన్​లైన్​లో పొందుపరుస్తున్నారు.

work rules china
'బాయ్‌కాట్‌ 996'.. చైనాలో కొత్త ఉద్యమం

ఒకవైపు అమెరికా సహా పలు దేశాల్లో 'ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌' సంక్షోభం కొనసాగుతుంటే.. చైనాలో మరో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్‌ ఉద్యోగులంతా.. 996 కల్చర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ ఉదమ్యాన్ని ప్రారంభించారు. ఓవర్‌టైం పనివేళలు, వీక్‌ ఆఫ్స్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పని చేస్తోన్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు నమోదు చేయగా.. అందులో అలీ బాబా గ్రూప్‌, బైడూ, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, బైట్‌ డాన్స్‌ వంటి చైనాలోని ప్రముఖ సంస్థల ఉద్యోగులు ఉండటం గమనార్హం.

ఎంతకీ ఏంటీ 996?

పనివేళలు.. రోజులను సూచించే సంఖ్యే 996. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారానికి 6 రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. చైనాలో ఉద్యోగులకు పనివేళలు, పనిభారం ఎక్కువగా ఉంటుందన్న విషయం బహిర్గతమే. కంపెనీ నిబంధనలో ఉద్యోగుల విధులు వారంలో ఐదు రోజులు, రోజుకు 8 గంటలు ఉంటాయని పేర్కొన్నా.. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారానికి ఆరు రోజులు.. రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు డేటాబేస్‌లో నమోదవుతుందట.

955ని తీసుకురావడమే ధ్యేయం

చైనాలో అధిక పనిగంటల విషయంపై గతకొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే బాయ్‌కాట్‌ 996 ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇందులో పాల్గొంటున్న వారంతా 996 కల్చర్‌ను నిషేధించి.. 955(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని వేళలు.. వారానికి ఐదు రోజులే పనిదినాలు)ని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ ఉద్యమం ద్వారా అయినా.. కంపెనీలు ఈ విషయంపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నారు. అలాగే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఏయే కంపెనీలో పని వేళలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ డేటాబేస్‌ ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి : మసీదు లక్ష్యంగా మరో బాంబు పేలుడు.. 32 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.