ETV Bharat / international

Afghanistan: అఫ్గాన్​లో ఆకలి కేకలు.. పేదరికంలోకి 97% మంది!

author img

By

Published : Sep 10, 2021, 9:01 PM IST

Afghanistan poverty
అఫ్గాన్​లో ఆకలి కేకలు

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్(Afghanistan Taliban)​ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, 97 శాతం మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఓ నివేదిక విడుదల చేసింది.

అమెరికా బలగాల ఉపసంహరణ, అనంతరం తాలిబన్ల(Afghan Taliban) ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని(Afghanistan crisis) ఎదుర్కొంటోంది. అటు ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలు మొదలు కాగా.. మరోవైపు ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పడ్డ రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడే చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది (2022) నాటికి అఫ్గాన్‌లో 97శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది.

అఫ్గానిస్థాన్‌లో ఉన్న తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఆహార పరిస్థితే కాకుండా మానవ, ఆర్థిక సంక్షోభాలను పరిగణనలోకి తీసుకుంటే.. వాస్తవ జీడీపీ 13శాతం తగ్గిపోయి పేదరికం రేటు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్​డీపీ) విశ్లేషించింది. అఫ్గాన్‌లో విపత్కర పరిస్థితులతో లక్షల మంది ప్రజల జీవితాలు మరింత వేగంగా క్షీణించే ప్రమాదం ఉందని యూఎన్‌డీపీ ఆసియా, పసిఫిక్‌ విభాగాధిపతి కన్నీ విగ్నరాజా పేర్కొన్నారు.

ఇప్పటికే కరవు పరిస్థితులు, కొవిడ్‌తో అల్లాడుతోన్న అఫ్గానిస్థాన్‌పై తాజాగా నెలకొన్న రాజకీయ మార్పు, విదేశీ నిధుల నిలిపివేత, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒత్తిడి, పెరుగుతున్న పేదరికం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర సేవలు, స్థానిక కుటుంబాలకు కనీస ఆదాయం కల్పించేలా ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస ఈమధ్యే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి: Taliban news: అఫ్గాన్​ సంక్షోభానికి తాలిబన్ల 'ఆజ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.