ETV Bharat / international

'కరోనా టీకా పంపిణీకి సమర్థవంతమైన ప్రణాళిక అవసరం'

author img

By

Published : Oct 8, 2020, 11:30 PM IST

WHO South-East Asia urges member countries to plan for effective roll-out of COVID-19 vaccination
'కరోనా టీకాపై సమర్థవంతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి'

ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ వ్యాపిస్తోన్న కరోనాను నియంత్రించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఆగ్నేయాసియా దేశాలలో వైరస్​ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం సమర్థవంతమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆగ్నేయాసియా దేశాలను కోరింది.

ఆగ్నేయాసియా దేశాల్లో కొవిడ్​ మహమ్మారి వేగంగా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). వైరస్​ను అరికట్టేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. త్వరలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పంపిణీకి సమర్థవంతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరింది.

ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే.. ఆగ్నేయాసియా ప్రాంతం కొవిడ్​ కోరల్లో చిక్కుకుందని డబ్ల్యూహెచ్​ఓ రీజనల్​ డైరెక్టర్​ డాక్టర్​ పూనమ్​ ఖేత్రపాల్​ సింగ్​ అన్నారు. వైరస్​ వ్యాప్తిని నివారించేందుకు బలమైన నాయకత్వం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్య చర్యలు పాటించాలని సూచించారు పూనమ్​.

కరోనా వ్యాక్సిన్​ కోసం.. ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేపట్టాయని తెలిపారు ఖేత్రపాల్​. కొవిడ్​ టీకా పంపిణీ కోసం సమర్థవంతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవిడ్​ వ్యాక్సిన్​ తొలుత అందరికీ అందడం కష్టమైన పని అని చెప్పిన పూనమ్​.. అందువల్ల ముందుగా ఎవరికి ఇవ్వాలి అనే అంశంలో స్పష్టమైన రోడ్​మ్యాప్​ ఉండాలన్నారు. వ్యాక్సిన్​ విషయంలో డబ్ల్యూహెచ్​ఓ ప్రతిపాదనల్ని మరోసారి గుర్తుచేశారు పూనమ్​. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆ తర్వాతే ఇతరులకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆమె పెళ్లి కోసం అంతరిక్ష యాత్రకు నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.