ETV Bharat / international

భారత్​కు వెళ్లే ప్రయాణికులకు అమెరికా కీలక సూచనలు

author img

By

Published : Nov 16, 2021, 11:03 AM IST

భారత్​కు వెళ్లే అమెరికన్ పౌరులకు పలు హెచ్చరికలను జారీచేసింది బైడెన్​ ప్రభుత్వం. వీటిలో కొవిడ్ నిబంధనలతో పాటు.. ఉగ్రవాదం సహా.. ఇతర అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు పాకిస్థాన్​కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచించుకోవాలని కోరింది.

US travel
అమెరికా

భారత్​కు వెళ్లేవారు నేరాలు, ఉగ్రవాదం, కరోనా వంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది. అలాగే.. పాకిస్థాన్‌కు వెళ్లాలనుకునే పౌరులు తమ ప్రయాణంపై పునరాలోచించవాల్సిందిగా కోరింది. ఉగ్రవాదం, మతపరమైన హింస వంటివాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

తీవ్రవాదం, పౌర అసమ్మతి ఎక్కువగా ఉన్న కారణంగా జమ్ముకశ్మీర్‌కు వెళ్లొద్దని.. అలాగే యుద్ధవాతావరణానికి అవకాశం ఉన్నందున భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధి లోపు ప్రయాణించవద్దని అమెరికా విదేశాంగ శాఖ భారత్​కు వెళ్లే తమ పౌరులకు సలహా ఇచ్చింది.

"భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారం ఒకటని నివేదికలు చెబుతున్నాయి. పర్యటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి"

---అమెరికా విదేశాంగ శాఖ

మరోవైపు.. తమ పౌరులకు కొవిడ్ నిబంధనలను సైతం సూచించింది అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ). టీకా పూర్తి డోసులు తీసుకున్నవారికి.. వైరస్ సంక్రమించే ప్రమాదం, తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు 'లెవల్ వన్' కొవిడ్-19 నిబంధనలు జారీ చేసింది.

'పాక్​ ప్రయాణాలపై ఓసారి ఆలోచించండి..'

ఉగ్రవాదం, కిడ్నాప్‌ల వంటి ఘటనలు అధికంగా నమోదవుతున్న కారణంగా పాకిస్థాన్​లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రాలతో పాటు.. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియాస్ (ఎఫ్‌ఏటీఏ)కి అమెరికా పౌరులు వెళ్లొద్దని సూచించింది.

"పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున దాడులకు ఉగ్రవాద గ్రూపులు కుట్ర పన్నుతున్నాయి. సైద్ధాంతిక ఆకాంక్షలతో పౌరులు, పోలీసులపై విచక్షణారహితంగా దాడులు జరిపిన ఘటనలున్నాయి. రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు, పర్యటక ప్రదేశాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా ఎటువంటి హెచ్చరిక లేకుండా దాడి జరిగే అవకాశం ఉంది."

---అమెరికా విదేశాంగ శాఖ

ఉగ్రవాదులు గతంలోనూ అమెరికా దౌత్యవేత్తలతో పాటు.. దౌత్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.