ETV Bharat / international

కరోనా దెబ్బకు 3కోట్ల ఉద్యోగాలు పోయాయ్​!

author img

By

Published : Jun 4, 2020, 11:49 AM IST

US job losses in May could raise 3-month total to 30 million
కరోనా దెబ్బకు అమెరికాలో 3కోట్ల ఉద్యోగాలు పోయాయ్​!

కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో మే నెలలో 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మూడు నెలల్లో దాదాపు మూడు కోట్ల మంది నిరుద్యోగులుగా మారినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం కారణంగా మే నెలలో కొత్తగా 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒక్క ఏప్రిల్​ నెలలోనే 20.5 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారాయి.

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 20 శాతానికి చేరుతుందని అంచనా. పెద్దలలో దాదాపు సగానికి తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నా సంక్షోభం కారణంగా కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకునే స్థితిలో సంస్థలు లేవు.

చరిత్రలో తొలిసారి..

అమెరికా చరిత్రలోనే ఎన్నడూ ఈ స్థాయిలో ఉద్యోగాలు పోలేదు. 2008-2009 మహా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయినవారి కంటే ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికం. అప్పటి నిరుద్యోగ శాతంతో పోల్చితే ప్రస్తుత నిరుద్యోగ శాతం రెట్టింపు సంఖ్యలో ఉంది.

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అధిక శాతం మంది తాత్కాలికంగానే తాము నిరుద్యోగులుగా ఉంటామని భావిస్తున్నారు. వాస్తవానికి మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు శాశ్వతంగా పోయినట్టే. కోటి మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమో, సంబంధం లేని రంగాల్లో అవకాశాల కోసమే ప్రయత్నించాల్సి ఉంటుంది.

ఆంక్షలు ఎత్తివేశాక సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశం ఉందని, అయినప్పటికీ సాధారణ పరిస్థితి రావాలంటే కొన్ని ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 1.7 కోట్ల మంది ఉద్యోగాలు తిరిగి పొందే అవకాశాలున్నాయని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఒకవేళ కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తే ఉద్యోగ నియామకాలు మరింత నెమ్మదిస్తాయని యూబీఎస్ ఆర్థికవేత్త సెత్ కార్పెంటర్​ తెలిపారు.

2008 సంక్షోభం తర్వాత 2014లో అత్యధికంగా 30లక్షల కొత్త ఉద్యోగాలు లభించాయని, ఆ లెక్కన చూసినా పరిస్థితులు కుదురుకోవడానికి కొన్నేళ్లు పడుతుందని మరో ఆర్థిక నిపుణుడు అడమ్ ఓజిమెక్​ చెప్పారు.

మార్చి మధ్యకాలం నుంచి అమెరికాలో 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారంతా కొత్తగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కాదు.

వ్యాక్సిన్ వచ్చే వరకు మునుపటిలా సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశాలు లేవని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.