ETV Bharat / international

కరోనా బాధితులతో కిక్కిరిసిన అమెరికా ఆసుపత్రులు

author img

By

Published : Nov 19, 2020, 7:19 AM IST

అమెరికాలో కరోనా బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు 1.60 లక్షలకుపైగా కొత్త కేసులు రావడం సహా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. గత మంగళవారం రికార్డు స్థాయిలో ఒక్కరోజే 77వేల మంది ఆసుపత్రుల్లో చేరారు. దీంతో ఆసుపత్రుల్లోని ఇతర ప్రాంగణాలను చికిత్సా కేంద్రాలుగా మార్చటం, అదనపు పడకలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కేసుల పెరుగుదలతో కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి రాష్ట్రాలు. పాఠశాలలను మూసివేసి ఆన్​లైన్​ తరగతుల వైపు మళ్లుతున్నాయి.

Covid patients
కరోనా బాధితులతో కిక్కిరిసిన అమెరికా ఆసుపత్రులు

అమెరికాపై కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైరస్​ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యా భారీగా పెరుగుతోంది. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆసుపత్రుల్లోని ప్రార్థనా మందిరాలు, ఫలహారశాలలు, విశ్రాంత గదులు, హాళ్లతో పాటు పార్కింగ్​ గ్యారేజీలను కూడా చికిత్స ప్రాంతాలుగా మార్చుతున్న సందర్భాలు ఉన్నాయి. పడకలు సరిపోక.. సమీప వైద్య కేంద్రాల్లో అదనంగా ఉండే పడకల కోసం వెతుకుతున్నారు సిబ్బంది. క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఒత్తిడి, అలసట వంటివి కనిపిస్తున్నాయి.

" ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. చికిత్స అందించే క్రమంలో మేము ఒత్తిడికి గురవుతున్నాం. నిరంతర సేవలతో నిరాశతో పాటు అలసిపోతున్నాం. కొన్ని సార్లు కన్నీళ్లతో విధులకు హాజరవటం, కన్నీళ్లతోనే విధులు ముగించుకొని వెళ్లటం జరుగుతోంది. "

- అలిసన్​ జాన్సన్​, జాన్సన్​ సిటీ మెడికల్​ సెంటర్​ అత్యవసర విభాగం డైరెక్టర్​, టెన్నెస్సీ

కొద్ది నెలలుగా అమెరికా ఆసుపత్రుల్లోని బాధితుల సంఖ్య రెండింతలు పెరిగింది. ఈ వారంలో ఆసుపత్రుల్లో చేరుతున్న రోజువారి రోగుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేసింది. గత మంగళవారం సుమారు 77,000 మంది వైరస్​తో ఆసుపత్రుల్లో చేరారు. కొత్త కేసులు గత రెండు వారాల్లో 80 శాతానికిపైగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సగటు సంఖ్య 1,60,000కుపైగానే ఉంటోంది. దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ వైరస్​ ఉద్ధృతి కనిపిస్తోంది. మరణాలు రోజుకు సగటున 1,155కు చేరాయి. ఈ నెలలో ఇదే అత్యధికం.

మళ్లీ ఆంక్షలు..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నారు. మాస్క్​ ధరించటం తప్పనిసరి సహా ఇతర ఆంక్షలు విధిస్తున్నారు. 'థ్యాంక్స్​గివింగ్​' నేపథ్యంలో ప్రైవేటు, పబ్లిక్​ సమావేశాల్లో సభ్యుల సంఖ్యపై ఆంక్షలు, ఇండోర్​ రెస్టారెంట్లల్లో భోజనం చేయటం నిషేధం, జిమ్​లను మూసివేయటం, బార్లు, ఇతర దుకాణాలు, వాణిజ్య సముదాయాల సామర్థ్యం, పని గంటలను తగ్గించటం వంటి చర్యలు చేపడుతున్నారు.

పాఠశాలల మూసివేత..

దేశంలోనే 10 లక్షల మంది విద్యార్థులు కలిగిన న్యూయార్క్​ సిటీ పాఠశాల వ్యవస్థలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో తరగతుల నిర్వహణను రద్దు చేశారు. వర్చువల్​గా తరగతులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏడు రోజుల వ్యవధిలో నగరం మొత్తం నిర్వహించిన పరీక్షల్లో 3 శాతం పాజిటివ్​గా తేలితే పాఠశాలను మూసివేస్తామని వేసవి నుంచే చెబుతున్నారు మేయర్​ బిల్​ డీ బ్లాసియో. గత వారం వారు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాయి కేసులు. దీంతో పాఠాశాలల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: అమెరికాలో మళ్లీ ఆంక్షలు.. మాస్క్​ తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.