ETV Bharat / international

అమెరికా: ఆ ముగ్గురికి కరోనా​ ఎలా సోకింది?

author img

By

Published : Feb 29, 2020, 10:59 AM IST

Updated : Mar 2, 2020, 10:48 PM IST

corona effect: US postpones southeast Asian leaders' meeting due to COVID-19 virus
అమెరికా: ఆ ముగ్గురికి కరోనా​ ఎలా సోకింది?

అమెరికాను కరోనా కలవరపెడుతోంది. ఎవరి నుంచి, ఎలా వ్యాపిస్తోందో తెలియని కేసులు గణనీయంగా పెరుగుతుండటం అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి కేసులు ఇప్పటికే మూడు నమోదయ్యాయి. మరోవైపు వైరస్ కారణంగా ఆగ్నేయ ఆసియా దేశాల నేతల సమావేశాన్ని అమెరికా వాయిదా వేసుకుంది.

అమెరికాలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్థారించారు వైద్యులు. అయితే ఇటీవల విదేశాలకు ప్రయాణించని అతడికి ఎవరి నుంచి వైరస్​ సోకిందో తెలియక ఆందోళన చెందుతున్నారు అధికారులు. ఇలా ఎవరి నుంచి సోకిందో తెలియకుండా వైరస్ ​బారినపడిన వారి సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో కరోనా వ్యాప్తి వేగం పెరిగే అవకాశముందని హడలిపోతున్నారు.

ఆరిజాన్​ రాష్ట్రంలో తాజా కేసు నమోదైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఇటీవలే ఓ పాఠశాలను సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. బడిని మూసివేశారు.

'ఈ కేసులో వైరస్ సోకింది కానీ, ఇది ఎవరి నుంచి వ్యాపించిందనేది ఇంకా తెలియదు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, వైరస్​ను ముందుగా కనిపెట్టడం ఇప్పుడు చాలా అవసరం. కరోనాను నివారించేందుకు అదనపు చర్యలు తీసుకోవాలి. కసీసం వైరస్​ వ్యాప్తిని తగ్గించగలగాలి. కరోనా సోకకుండా ప్రజలు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఇంట్లో ఉండి చదువుకుంటే మంచిది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.'

-సారా కాడీ, వైద్యుడు.

కాలిఫోర్నియాలో ఇదే విధంగా ఈ వారం రెండు కేసులు నమోదయ్యాయి. రెండు కేసులు వృద్ధులకు సంబంధించినవే.

వైరస్​ ప్రభావమే...

మరో వైపు.. వచ్చే​ నెలలో థాయ్​లాండ్​లో జరగాల్సిన ఆగ్నేయ ఆసియా దేశాల నేతల సమావేశాన్ని వాయిదా వేసింది అగ్రరాజ్యం. పలు దేశాల పౌరులు ఒక చోట చేరినప్పుడు కరోనా వైరస్​ వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్​హౌస్​ అధికారులు తెలిపారు. ​ ఏసియన్​ భాగస్వాములతో చర్చించిన తరువాతే ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే అమెరికాలో 62 మందికి వైరస్​ సోకినట్లు నిర్థరణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 84 వేల మందికి సోకిన కరోనా.. ఇప్పటివరకు 2870 మందిని బలిగొంది.

ఇదీ చదవండి:కరోనాతో ప్రపంచం విలవిల.. 57 దేశాలకు వ్యాప్తి

Last Updated :Mar 2, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.