ETV Bharat / entertainment

'గీతా ఆర్ట్స్‌'లో 'గీత' ఎవరో తెలుసా? సీక్రెట్​ చెప్పేసిన అల్లు అరవింద్‌

author img

By

Published : Oct 18, 2022, 8:11 PM IST

secret behind the name of Geetha arts
'గీతాఆర్ట్స్‌'లో 'గీత' పేరు సీక్రెట్​ చెప్పేసిన అల్లు అరవింద్‌.. ఏంటంటే?

టాలీవుడ్​లో ఎన్నో సూపర్ హిట్​ చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. అయితే తమ నిర్మాణ సంస్థకు గీత అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలిపారు. ఏంటంటే?

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిటి చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థలలో గీతాఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కొత్తదనం నిండిన బలమైన కంటెంట్‏తో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే అల్లు ఫ్యామిలీలో గీతా అనే పేరు గల వ్యక్తి ఎవరు కనిపించలేదు. కానీ నిర్మాణ సంస్థకు మాత్రం గీత అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరా గీత? అనే సందేహాం చాలా మందికి ఉండేది. తాజాగా ఎట్టకేలకు గీత పేరు వెనక ఉన్న అసలు కథ చెప్పేశారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. గీతా ఆర్ట్స్‌లో 'గీత' ఎవరు? ఆ పేరు వెనక ఏదైనా కథ ఉందా? అని అలీ అడిగన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

"గీతా ఆర్ట్స్‌ అనే పేరు పెట్టింది మా నాన్న. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. 'ప్రయత్నం మాత్రమే మనది. ఫలితం మన చేతిలో ఉండదు' ఇది సినిమాలకు బాగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యడమే కానీ, ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అని గీతా పేరు పెట్టారు. (మధ్యలో ఆలీ అందుకుని.. పెళ్లయిన తర్వాత నిర్మలా ఆర్ట్స్‌ అని పెట్టవచ్చు కదా అని అడిగారు) గీత పేరు మీద తీసిన సినిమాలన్నీ సిల్వర్‌జూబ్లీ ఆడాయి. అందుకే మార్చాలన్న ఆలోచన మాకు రాలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నేను చదువుకునే రోజుల్లో నాకు 'గీత' అనే గర్ల్‌ఫ్రెండ్‌ ఉండేది. నా స్నేహితులు కూడా ఆ పేరుతో ఆటపట్టించేవారు (నవ్వులు)" అని పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో.. చివరిసారి అల్లు రామలింగయ్య మీకేమి చెప్పారు? గుర్తుందా? అని అలీ అడగగా.. "ఆయన మరో రెండురోజుల్లో కోమాలోకి వెళ్తారనగా. నన్ను సైగ చేస్తూ పిలిచారు. నేను వెళ్లిపోతున్నా అని సైగలతో చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయారు. అదే మా మధ్య జరిగిన చివరి సంభాషణ. మా నాన్నకు అల్లు అనే పేరు చాలా ఇష్టం. ఆయన ఒకవేళ ఇప్పుడు కనిపిస్తే అల్లు అనే పేరు కోసం నేను కష్టపడ్డాను. ఇప్పుడు మీ మనవళ్లకు ఇచ్చాను. వాళ్లు మరింత పైకి తీసుకెళ్తున్నారని చెబుతాను" అని వెల్లడించారు.

గీతా ఆర్ట్స్‌లో నాన్న ఎన్ని సినిమాలు చేశారు. రెమ్యునరేషన్‌ ఎంత ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. "దాదాపు అన్ని సినిమాల్లో చేశారు. ఇక రెమ్యునరేషన్‌ విషయానికొస్తే నాన్న దగ్గరి నుంచి చిరంజీవి, అల్లు అర్జున్‌ వరకు అందరికీ వాళ్లు బయట రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటారో అంతే ఇస్తాను. ఇటీవల అల్లు అర్జున్‌ని కూడా 'మీ తండ్రి బ్యానర్‌లో నటిస్తే పారితోషికం తీసుకుంటారా' అని అడిగారట. దానికి బన్ని 'ఎందుకు తీసుకోను. కచ్చితంగా తీసుకుంటా. ఆయనకు లాభాలు వస్తే నాకేమైనా ఇస్తారా. ఇవ్వరు కదా! అందుకే నా పారితోషికం నేను తీసుకుంటా' అని సమాధానం ఇచ్చాడట" అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అల్లు అరవింద్ 'దాదాగిరీ'.. రంగంలోకి సీఎం.. చిరును అలా అన్నారని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.