ETV Bharat / crime

Jeedimetla Accident : బైకు మురిపెం తీరకుండానే.. మృత్యు ఒడికి చేరుకున్నాడు

author img

By

Published : Nov 30, 2021, 10:38 AM IST

Updated : Nov 30, 2021, 10:56 AM IST

Jeedimetla Road Accident, jeedimetla accident
జీడిమెట్ల రోడ్డు ప్రమాదం

Jeedimetla Road Accident Case Update : మద్యం మత్తు.. నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మారం చేస్తున్నాడని బైక్‌ ఇప్పించడమే కారణమైంది. స్నేహితుడు పిలిచాడని వెళ్లడమే శాపమైంది. ఈనెల 25న అర్ధరాత్రి ఇద్దరు స్నేహితులు మద్యంమత్తులో జీడిమెట్ల ఠాణా పరిధిలో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మృత్యువుతో పోరాడి సోమవారం మరో యువకుడు తుడి శ్వాస విడిచాడు.

Jeedimetla Road Accident Case Update : జీడిమెట్లలోని సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన అబ్బాస్‌(20) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనం కావాలని కొన్ని నెలలుగా తల్లిదండ్రులను కోరుతున్నాడు. వారు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పించాల్సిందేనని మూడు రోజులు అన్నం కూడా తినలేదు. కుమారుడిపై ప్రేమతో తల్లిదండ్రులు వాహనం ఇప్పించారు. బైక్​ మురిపెం తీరకుండానే అబ్బాస్ తనువు చాలించాడు. బయటకు వెళ్దామని స్నేహితుడు కొత్త వాహనంపై ఈనెల 25న స్నేహితునితో కలిసి తిరుగుతూ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పూలు అమ్ముకుంటూ జీవిస్తున్న వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

పెళ్లయి ఏడాదైనా కాలేదు

బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీకి చెందిన సాయికిరణ్‌(25) ప్రైవేటు ఉద్యోగి. 11 నెలల క్రితం వివాహమైంది. అబ్బాస్‌తో కలిసి రాత్రి 1.45 గంటల ప్రాంతంలో బాలానగర్‌ వైపు మెరుపు వేగంలో వెళ్తున్నారు. చింతల్‌ బస్టాప్‌ సమీపంలోని ఆర్‌ఎన్‌సీ ఆసుపత్రి వద్ద ఓ కారును అధిగమించే సమయంలో అదుపుతప్పి విభాగినిని (Jeedimetla Road Accident) ఢీకొట్టారు. ఇద్దరూ వాహనంపై నుంచి ఎగిరి దూరంగా పడిపోయారు. అబ్బాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన సాయికిరణ్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితమే తండ్రి.. ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మద్యం మత్తు, శిరస్త్రాణం పెట్టుకోలేదు

ప్రమాదం జరిగిన రోజు స్నేహితులిద్దరూ మద్యంమత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హెల్మెట్‌ పెట్టుకోకుండా 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లడంతోనే నియంత్రణ కోల్పోయినట్లు తేలింది. వాహనం నడిపిన అబ్బాస్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు తెలిపారు.

ఇదీ చూడండి: chintal bike accident: వంద కిలోమీటర్ల వేగం.. రెప్ప పాటులో ఘోరం

Last Updated :Nov 30, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.