ETV Bharat / crime

కరీంనగర్​ కారు ప్రమాద ఘటనపై ప్రతిపక్షాల ఆందోళన.. మంత్రి ఆర్థిక సాయం

author img

By

Published : Jan 30, 2022, 3:54 PM IST

Karimnagar Car Accident: కరీంనగర్​లో కారు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు, పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు. ఘటనపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్​.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10 వేలు చొప్పున ప్రకటించారు.

karimnagar car accident
కరీంనగర్​లో కారు ప్రమాదం

కరీంనగర్​ కారు ప్రమాద ఘటనపై బాధితులు, ప్రతిపక్షాల ఆందోళన

Karimnagar Car Accident: కరీంనగర్​లో కూలీలపై కారు దూసుకెళ్లిన ఘటనలో బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు, పలు పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఆందోళనలో కాంగ్రెస్​, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఘటనపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్​ బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ప్రకటించారు. ఆ సాయాన్ని వారి కుటుంబాలకు ఆర్డీవో ఆనంద్​ కుమార్​ అందించారు.

ఎందుకు అరెస్ట్​ చేయలేదు.?

కారు బీభత్సంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన వారిని ఇంతవరకూ అరెస్ట్​ చేయలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని.. కూలీలు బలవుతున్నా వారికి పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం లేదని మండిపడ్డారు.

"మాకు పని దొరికితేనే పూట గడిచేది. మా పిల్లలు చనిపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న మాకు దిక్కులేకుండా పోయింది. ఇంత జరిగినా ప్రమాదానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అందుకే రోడ్డుపై బైఠాయించాం." -బాధితుల బంధువులు

"కారు సృష్టించిన బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు ఇంతవరకూ మంత్రి ఇక్కడికి రాలేదు. గుడిసెలు పీకేసినందుకు పునరావాసం కల్పించాలని కూలీలు వేడుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్​ చేయలేదు." - ప్రతిపక్షాల నాయకులు

దూసుకెళ్లిన కారు

నగరంలోని కమాన్‌ సమీపంలో కరీంనగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన కొందరు కూలీలు కొలిమి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం కావటంతో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్లు కాల్చుకుంటూ... ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో అటుగా దూసుకొచ్చిన కారు.... రోడ్డుపక్కన పనులు చేసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని హుటాహుటిన కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.... మరో ముగ్గురు మహిళలు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఫరియాద్‌, సునీత, లలిత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కారు వదిలేసి పరార్​

ప్రమాదం జరిగిన అనంతరం కారును వదిలేసి అందులో ఉన్న వారు పరారయ్యారు. కారుపై 9 ఓవర్‌ స్పీడ్‌ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి వరకు తమతో పనిచేస్తున్న వారు కళ్ల ముందే విగతజీవులుగా మారటంతో... వారి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాలను పలు పార్టీల నాయకులు పరామర్శించి ఓదార్చారు.

ఇదీ చదవండి: Karimnagar Car Accident : గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.