ETV Bharat / crime

Farmer suicide: అప్పు మిగిల్చిన మిర్చి పంట.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య

author img

By

Published : Feb 21, 2022, 1:25 PM IST

Farmer suicide: నేల తల్లినే నమ్ముకున్న రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షం ఓ వైపు.. పంటకు తెగుళ్లు మరో వైపు.. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అప్పు చేసి పంట వేసి.. కాలం కలిసి రాక నష్టాలు ఎదుర్కొంటున్న అన్నదాతకు ఆత్మహత్యే శరణ్యంగా మిగిలింది. తాజాగా మహబూబాబాద్​ జిల్లాలో ఓ రైతన్న.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

farmer suicide
రైతు ఆత్మహత్య

Farmer suicide: అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రామ్ లాల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ శ్రీను(35)కు.. రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులోనే సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాలం కలిసొస్తుందనే ఆశతో.. ఈ ఏడాది మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. 2 ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో ఇతర పంటలను వేశారు. సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో తామర పురుగు, అకాల వర్షంతో మిర్చి పంట దెబ్బ తిని.. కేవలం రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.

అప్పు తీరే మార్గం లేక

ఆ పంటను అమ్మగా వచ్చిన నగదుతో.. అప్పు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో రైతు శ్రీను మనస్తాపానికి గురయ్యారు. అప్పు తీరే మార్గం లేక శనివారం.. పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన సమీప రైతులు.. శ్రీనును మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రైతు.. అదే రోజు రాత్రి మృతి చెందారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

ఇదీ చదవండి: సాగర్ భూములపై ప్రజాప్రతినిధుల కన్ను.. ఆక్రమణలపై ఉక్కుపాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.