ETV Bharat / crime

Chilli Farmer Suicide Mulugu : పురుగుల మందు తాగి మిరప రైతు ఆత్మహత్య

author img

By

Published : Dec 13, 2021, 12:03 PM IST

Updated : Dec 13, 2021, 12:35 PM IST

Farmer Suicide in Mulugu
Farmer Suicide in Mulugu

11:59 December 13

Chilli Farmer Suicide Mulugu : పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య

Chilli Farmer Suicide Mulugu : పుడమితల్లినే నమ్ముకున్న రైతు.. తాను ఊపిరి వదిలేవరకు సాగు చేయడం మానడు. కరవొచ్చినా.. వరదలు బీభత్సం సృష్టించినా.. పంటకు పురుగు పట్టినా.. దిగుబడి సరిగ్గా రాకపోయినా.. మద్దతు ధర లేకపోయినా.. పంట గిట్టుబాటు కాకపోయినా.. మరోసారి సాగు చేసేందుకు తన వద్ద సొమ్ము లేకున్నా.. ఎక్కడైనా అప్పు చేసైనా సరే.... సాగు మాత్రం మానడు. భూతల్లితో తన బంధాన్ని వదులుకోడు. పంట వేసిన దగ్గరి నుంచి దిగుబడి వచ్చే వరకు రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. పంట చేతికొచ్చే సమయంలో కాస్త మొగులుపట్టినా.. అతని గుండెల్లో గుబులు రేగుతుంది. కంటి మీద కునుకేయకుండా.. పంటకు కాపలా కాస్తాడు. ఆ వరణుడికి కోటి మొక్కులు మొక్కుతాడు. ఇక వాన రాక మానదు.. పంట నష్టం తప్పదు అని అర్థమయ్యాక.. ఏం చేయలేనని తెలిసి దిగాలు పడతాడు. ఎంత నష్టమొచ్చినా.. తట్టుకుని మరోసారి ప్రయత్నిస్తాడు.

పురుగుల మందు తాగి..

Mulugu Farmer Suicide : ఇలా నష్టాలపాలై.. పడుతూ.. లేస్తూ.. ఎన్నిసార్లు దెబ్బపడినా నిలదొక్కుకున్న ఓ రైతు.. ఇక పోరాటం చేయలేక చేతులెత్తేశాడు. పంటకు పట్టిన చీడ వదిలేందుకు చల్లే పురుగుల మందును తాగి.. తన జీవితానికి పట్టిన దరిద్రాన్ని పారదోలాలనుకున్నాడు. భూతల్లితో తనకున్న బంధాన్ని వదులుకోలేక చివరకు ఊపిరి వదిలాడు.

మిరప రైతు ఆత్మహత్య

Mulugu Farmer Suicide Today : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాకలో మిరప రైతు హనుమయ్య(48) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిరప సాగుతో నష్టపోయానని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.

ధైర్యం చెప్పేవాడే ఇలా చేస్తే..

Farmer Suicide Today News : నిన్న మొన్నటిదాకా తమ మధ్యే తిరిగిన హనుమయ్య ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో విషాదం నింపింది. ఎంతో ధైర్యంగా ఉండే ఆ రైతు చివరకు పురుగుల మందు తాగడం అక్కడి కర్షకులతో కన్నీళ్లు పెట్టించింది. వ్యవసాయంలో ఎన్నిసార్లు నష్టపోయినా భూతల్లి ఎప్పుడు తమకు మంచే చేస్తుందని చెప్పేవాడని.. అలాంటిది అతను ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు.

మా గతి ఇంతేనా..

మిరప పంట సాగు చేసే రైతులందరి పరిస్థితి దాదాపు హనుమయ్య లాంటిదేనని కర్షకులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని వాపోయారు. ఏడాదికి రెండు సార్లు రైతు బంధు ఇవ్వడం కాదు.. తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రైతుల కష్టాన్ని గుర్తించి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

Last Updated :Dec 13, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.