ETV Bharat / crime

నిరుద్యోగుల ఆశే ఆ ముఠా అస్త్రం.. విచారణలో విస్తుగొలిపై నిజాలు బహిర్గతం..

author img

By

Published : Jan 24, 2022, 7:01 AM IST

ఇన్ఫోసిస్‌.. విప్రో.. టీసీఎస్‌.. స్పైస్‌జెట్‌.. ఎయిర్‌ఇండియా సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామని అమాయకులను నమ్మించి అందినకాడికి దోచుకున్నారు. డబ్బు దండుకునేందుకు కొత్తకొత్త పద్ధతులు అమలు చేస్తూ.. ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు. డిజిటల్‌ చెల్లింపుల ద్వారా కోట్లు కొల్లగొట్టారు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే అంటూ తేడా లేకుండా అన్నింటినీ విచ్చలవిడిగా వాడేస్తూ.. ఉద్యోగార్థుల ఆశను సొమ్ము చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో.. కోట్లు కొల్లగొట్టి అరెస్టయిన సైబర్​ ముఠా నుంచి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

cyber fraud gang Revealed interesting facts in police enquiry
cyber fraud gang Revealed interesting facts in police enquiry

ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడిన కేసులో అరెస్టయిన కాల్‌సెంటర్‌ నిర్వాహకుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రాజేష్‌సింగ్, అభినవ్‌సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకు వేలమందిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, విమానయాన సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ.. దిల్లీలో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న నిందితుల్లో ఐదుగురు యువతులను పోలీసులు విచారించగా.. సైబర్‌ నేరస్థుల వ్యూహాలు బయటపడ్డాయి.

దేన్ని వదలకుండా వాడేశారు..

బాధితుల నుంచి నగదును కాజేసేందుకు మోసగాళ్లు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా డిజిటల్​ మాధ్యమాలను ఎంచుకున్నారు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే అంటూ దేన్ని వదలకుండా.. అన్నింటినీ వాడుకున్నారు. వ్యక్తిగత ఖాతాలైతే దొరికిపోతామని ఊహించిన మోసగాళ్లు.. ప్రైవేటు కంపెనీలు, సంస్థలను కాగితాలపై సృష్టించి వాటి ద్వారా నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. రోజుకు 5 నుంచి 50లక్షల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా అంతా సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే.. అరవింద్​శర్మ అనే యువకుడితో పేటీఎంలో నకిలీఖాతాలను తెరిపించారని.. ఒక్కోఖాతాకు రూ.12వేల చొప్పున చెల్లించినట్టు తేలింది.

వాళ్లే ఫిర్యాదు చేశారు..

మోసపోయిన బాధితుల్లో ఎక్కువమంది హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల వాళ్లున్నారు. వీరిలో సుమారు మూడు వేల మంది బాధితులు.. 20 వేలలోపే నష్టపోవటం వల్ల చాలామంది పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో.. రూ.5లక్షల నుంచి రూ.15లక్షలు నగదు బదిలీ చేసినవారే పోలీసులను ఆశ్రయించారు. సైబర్‌క్రైమ్​, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చైతన్యపురి, కూకట్‌పల్లితో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని బాధితులు ఫిర్యాదులు చేశారు.

ఏం చేస్తారంటే...?

కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న అమ్మాయిలు ఉద్యోగార్థులకు ఫోన్‌ చేస్తారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రముఖ ఎంఎన్​సీ సంస్థల పేర్లు చెప్తారు. అన్ని వివరాలు తీసుకుని.. వారం పదిరోజుల్లో ఉద్యోగాలిస్తామని ఊరిస్తారు. కొన్ని రోజుల తర్వాత.. తమ అర్హతలకు తగిన ఉద్యోగం వచ్చిందని నమ్మించి.. నకిలీ ఉద్యోగ నియామక ధ్రువపత్రాలను మెయిల్‌లో పంపిస్తారు. ముందుగా రూ.5 వేలు చెల్లించాలంటారు. ఒకవేళ విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు కావాలనుకునేవారికి.. ఏకరూప దుస్తులు, బూట్లు, నెలపాటు వసతి కల్పించేందుకు నగదు జమచేయాలని చెప్తారు. ఉద్యోగంలో చేరేముందు రెండు నెలల జీతం ధరావతుగా జమచేయాలని.. జాబ్​లో చేరాక పదిరోజుల్లో సొమ్ము మొత్తం బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తామని వివరిస్తారు. బాధితులు తాము సూచించిన విధంగా చేస్తున్నారని తెలుసుకోగానే... జీఎస్టీ,సెక్యూరిటీ డిపాజిట్, లాప్‌టాప్ పేరుతో లక్షల్లో నగదు బదిలీ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటారు. డబ్బు లేదని తెలుసుకున్న మరుక్షణం ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తారు.

ఉద్యోగార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

  • ఉద్యోగాలిస్తామని ఎవరైనా ఫోన్లు చేసినప్పుడు.. ఆ సంస్థ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వీలైతే.. కొంత సమయం ఇవ్వాలని అడిగాలి. ఆ సమయంలో సంస్థ గురించి తెలుసుకుని అంతా సవ్యంగా ఉంటేనే.. ముందుకెళ్లాలి.
  • ఎవరైనా ఉద్యోగం కావాలంటే.. నగదు జమచేయాలని చెప్పిన వెంటనే చేయకుండా.. ఒక్క నిమిషం ఆలోచించాలి. కార్పొరేట్​, ప్రైవేటు సంస్థలు జీతాలు ఇస్తూ ఉద్యోగం చేయించుకుంటాయే తప్ప.. నగదు జమచేయాలని అడగవు.
  • ఏ ప్రైవేటు కంపెనీ, కార్పొరేటు సంస్థ రెండు నెలల జీతం మొత్తం ధరావతు చెల్లించాలంటూ సూచించబోవు.
  • విమానయాన సంస్థలు.. ఉద్యోగాలకు అర్హులైనవారికి శిక్షణ ఉచితంగా ఇస్తూనే.. ట్రైనీగా ఉన్నకాలంలో జీతం కూడా చెల్లిస్తాయి.

సంబంధిత కథనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.