ETV Bharat / crime

Job Frauds: నిరుద్యోగులను ముంచుతున్న సైబర్ కేటుగాళ్లు

author img

By

Published : Jan 15, 2022, 5:28 AM IST

Job Frauds: సైబర్ నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేసి నిండా ముంచుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల పేరుతో ప్రకటనలిస్తూ అమాయకులను నమ్మించి వంచిస్తున్నారు. కార్పొరేట్ బడా కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, డిపాజిట్ల పేరుతో విడతల వారీగా ముక్కుపిండి వసూలు చేసి మొహం చాటేస్తున్నారు.

Job Frauds
Job Frauds


Job Frauds: కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కొలువుల కోసం ఆశగా చూస్తున్న యువత బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు... మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చి నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. వారిని సంప్రదించగానే తొలుత దరఖాస్తు రుసుము వసూలు చేస్తారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఇంకొంత లాగుతారు.

రూ. 10 లక్షల దాకా...

కంపెనీకి ఎంపికయ్యావంటూ నమ్మించి నకిలీ ఉద్యోగ నియామక ధ్రువపత్రాలను మెయిల్‌లో పంపిస్తారు. జీఎస్టీ,సెక్యూరిటీ డిపాజిట్, లాప్‌టాప్ పేరుతో అదనంగా నగదు పిండేస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థి నుంచి కనీసం రూ. 2లక్షల నుంచి 10లక్షల వరకు లాగేస్తారు. చివరికి ఫోన్లు స్విచాఫ్ చేస్తారు. మరికొంత మంది సైబర్ నేరగాళ్లు జాబ్ సైట్లలో కంపెనీ ప్రతినిధులమంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న దిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

అమాయకులే వల...

ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు వీసా ఇప్పిస్తామంటూ నైజీరియన్‌ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. నైజీరియన్లకు స్థానికంగా ఉండే ఇతర రాష్ట్రాలకు చెందినవారు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్నారు. అమాయకులను నమ్మించి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయించుకుంటున్న దారుణాలు వెలుగుచూస్తున్నాయి.

కార్పొరేట్ కంపెనీలేవీ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయబోవని... కొలువుల ప్రకటన కోసం కంపెనీల వెబ్​సైట్‌నే ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.