ETV Bharat / crime

ప్రకటనలు నమ్మి.. పెట్టుబడులు పెట్టారు... చివరికి...

author img

By

Published : Dec 27, 2021, 5:49 AM IST

Love Life Natural and Healthcare Cheating
Love Life Natural and Healthcare Cheating

Love Life Natural and Healthcare Cheating: సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదించవచ్చన్న ప్రకటనలతో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. రోజూ కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా వైద్య పరికరాలపై పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందన్న ప్రకటనను నమ్మి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. చివరికి మోసపోయామని గ్రహించి విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.200 కోట్ల మేర మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

ప్రకటనలు నమ్మి.. పెట్టుబడులు పెట్టారు... చివరికి...

Love Life Natural and Healthcare Cheating : సాంకేతికత పెరుగుతున్న తరుణంలో సైబర్ క్రైం మోసాలూ పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థి నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తి వరకు ఈ సైబర్ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడిన ఉదంతాలు ఇప్పటికే చూశాం. తాజాగా విజయవాడలో మరో ఆన్‌లైన్‌ మోసం వెలుగు చూసింది. లవ్ లైఫ్ నేచురల్ అండ్ హెల్త్ కేర్ పేరుతో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్‌ వ్యాపారం బాధితులకు కుచ్చుటోపీ పెట్టింది. మొదట యాప్‌ని ప్రారంభించిన నిర్వాహకులు అనంతరం యాప్‌ని... లవ్ లైఫ్ నేచురల్ అండ్ హెల్త్ కేర్ పేరుతో వెబ్​సైట్​గా మార్చారు. ఈ ఘరానా సైబర్ మోసాన్ని నిర్వాహకులు పకడ్బందీగా చేశారు. ఈ వెబ్​సైబ్​లో ఉండే వైద్య పరికరాలపై పెట్టుబడి పెడితే వాటి ద్వారా రోజూ వారికి డబ్బు వస్తుందని బాధితులను నమ్మించారు.

రూ.3వేల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి..
ఎవరైనా మెుదట ఒక మెడికల్ పరికరం కొనుగోలు చేస్తే ఆయన పేరు మీద ఆ పరికరం రిజిస్టర్ చేస్తారు. వాటిని యాప్‌ వారే ఇతరులకు అద్దెకు ఇచ్చి.. వస్తువు కొన్నవారికి రోజూ అద్దె చెల్లిస్తారు. మొదట్లో చాలా మంది చిన్న ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 20 రోజుల్లోనే పెట్టుబడి వచ్చేయడంతో ఆకర్షితులయ్యారు. అలా వంటింటి గృహిణి నుంచి ఉద్యోగుల వరకు అందరూ పెట్టుబడి పెట్టారు. మూడు రోజుల క్రితం నుంచి నిర్వాహకులు ఫోన్లు స్విచ్ఛాప్ రావటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఒక్కో బాధితుడు కనీసం రూ.3 వేల నుంచి 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

బాధితుల్లో పెద్దఎత్తున యువకులు..
లవ్ లైఫ్‌లో నేచురల్ అండ్ హెల్త్ కేర్‌లో మోసపోయిన బాధితుల్లో యువకులు పెద్దఎత్తున ఉన్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే వారు సైతం పెట్టుబడి పెట్టి మోసపోయారు. చైన్ పద్దతిలో జరిగిన ఈ సైబర్ నేరంతో ఇతరులతో డబ్బు కట్టించినవారిపై ఒత్తిడి పెరుగుతోంది. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని బాధితులు అడ్మిన్‌లను డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర ఆందోళన చెందుతున్న అడ్మిన్లు... తమకు ఏమీ తెలియదని చేతులెత్తేస్తున్నారు. తాము కూడా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు.

ఇదీచూడండి : గొలుసు కట్టు విధానంలో కోట్లు కొల్లగొట్టిన సంస్థ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.