ETV Bharat / crime

గొలుసు కట్టు విధానంలో కోట్లు కొల్లగొట్టిన సంస్థ

author img

By

Published : Mar 7, 2021, 6:25 AM IST

సంతానం లేని వారికి సంతాన సాఫల్యం, ఊబకాయంతో బాధపడే వారికి బరువు తగ్గేలా చేయడం. ఇదేదో ఆరోగ్య సంస్థ, తమ ఉత్పత్తులు విక్రయించుకునే ప్రకటనలు కావు. గొలుసు కట్టు సంస్థలు.. సభ్యులను చేర్పించుకోవడానికి ఆకర్షించే ప్రయత్నం. గొలుసుకట్టు విధానానికి, ఆరోగ్య ఉత్పత్తులకు సంబంధమేమిటా? అని మీ సందేహం. అయితే ఈ కథనం చూడండి.

plundered the coats in the chain scam in telangana
గొలుసు కట్టు విధానంలో కోట్లు కొల్లగొట్టిన సంస్థ

గొలుసు కట్టు విధానంలో కోట్లు కొల్లగొట్టిన సంస్థ

ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గొలుసు కట్టు విధానంలో ప్రజలు సొమ్ము కోట్లు కొల్లగొట్టింది. సంస్థలో 12,500 రూపాయలు కట్టి సభ్యులుగా చేరితే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు ఇస్తారు. రుచికరమైన, ఖరీదైన కాఫీ ఫౌడర్, నాణ్యమైన పండ్లరసాల పౌడర్, ఇలా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. గొలుసుకట్టు విధానంలో సభ్యులుగా చేర్పించుకుంటూ పోతే సభ్యత్వాన్ని బట్టి కమీషన్ వస్తుంది. ఇండస్ వివా సంస్థలో సభ్యత్వం తీసుకున్న గచ్చిబౌలికి చెందిన ఓ వ్యక్తి తనకు తిరిగి డబ్బులు రాకపోవడంతో గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కంపెనీ అక్రమాల గుట్టురట్టయింది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలకు పాల్పడిందని గుర్తించారు. 2014 నుంచి ఈ సంస్థ దాదాపు 10 లక్షల మంది సభ్యులను చేర్పించుకొని సుమారు 1500 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సజ్జనార్ తెలిపారు.

ఉద్యోగుల నియామకం

సభ్యులను చేర్పించే వాళ్లకు ఆకర్షణీయ కమీషన్ ఇవ్వడం, విదేశాలకు తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. 10వేల మంది సభ్యులను చేర్పిస్తే ఏకంగా బెంజ్ కారు, ఖరీదైన ఉంగరంతో పాటు అమెరికాకు నిర్వాహకులు తీసుకెళ్తున్నారు. ఈ కేసులో సంస్థ సీఈఓ, సీఓఓతో కలిపి 24మందిని అరెస్ట్ చేశారు. గతంలో ఆమ్ వే సంస్థలో పనిచేసిన థామస్, 2014లో బెంగళూరు కేంద్రంగా ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఉద్యోగులను నియమించుకొని సభ్యత్వాలు చేయించారు. ఇండస్ వివాలో సభ్యులుగా చేరడమే కాకుండా... చాలా మందిని సభ్యులుగా చేర్పించిన ఖమ్మం, యాదగిరిగుట్ట, మిర్యాలగూడకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలతో ఫోటోలు దిగి... తమ సంస్థకు ప్రచారంగా వాడుకున్నారు. అమెరికా, ఉగాండా, బంగ్లాదేశ్‌కు ఇండస్ వివా వ్యాపారం విస్తరించినట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇండస్ వివాకు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 2లక్షల మంది సభ్యులు వరకు ఉండొచ్చని సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి : నకిలీ విద్యా ధ్రువపత్రాలకు అడ్డాగా హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.