ETV Bharat / city

SRSP: గోదావరికి తగ్గిన వరద ఉద్ధృతి.. ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

author img

By

Published : Jul 25, 2021, 1:14 PM IST

Updated : Jul 25, 2021, 3:05 PM IST

floods to SRSP project, sri ram sagar project water levels
ఎస్సారెస్పీ గేట్లు మూసివేత, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద

ఎగువన రెండ్రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఎస్సారెస్పీ ప్రధాన గేట్లు మూసివేశారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన మహారాష్ట్రలో రెండ్రోజులుగా వర్షాలు ఎక్కువ లేకపోవడం... రాష్ట్రంలోనూ అంతంతమాత్రంగానే వానలు కురుస్తుండటంతో వరద తగ్గింది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఎస్సారెస్పీ ప్రధాన గేట్లను మూసివేశారు. 20 వేల క్యూసెక్కులకు వరద తగ్గడంతో.... ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.9 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1089.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుకు... ఇప్పటికే 82.215 టీఎంసీల నిల్వ ఉంది.

గోదావరికి తగ్గిన వరద ఉద్ధృతి

చరిత్రలో రికార్డు

గోదావరి ఉప్పొంగడంతో రెండు రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈనెల 22న ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో వరద చేరిందని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో ఇంత ఎక్కువ వరద రావడం కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగిందని వెల్లడించారు.

రెండు రోజుల్లో నిండు కుండలా..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు... 6 గంటల్లోనే 9 టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జూన్ 1న ప్రాజెక్టులో కేవలం 18 టీఎంసీల నీరు ఉండగా.. జులై 1నాటికి అది 27 టీఎంసీలకు చేరింది. జులై 16న ఒక్కరోజే 10టీఎంసీల నీరు రాగా.. 21న సైతం 10టీఎంసీలు చేరింది. ఇక జులై 22న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా.. ఆరోజు మధ్యాహ్నం గేట్లు ఎత్తి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 45.3 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.

జులైలో వరదలు తక్కువ

ఎస్సారెస్పీ(SRSP) చరిత్రలో రెండో అత్యధిక అవుట్ ఫ్లో ఈ ఏడాది రికార్డయింది. 1983లో 9 లక్షల క్యూసెక్కులు వదలగా... ఈ నెల 22న 6లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జులై నెలలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం తక్కువ సందర్భాల్లో జరిగింది. ఈ ఏడాది జులైలో శనివారం సాయంత్రం 5 గంటల వరకు 98.5 టీఎంసీలు ప్రాజెక్టులో చేరితే అదే సమయానికి 45.3 టీఎంసీలు దిగువకు వదిలారు. 1989 జులైలో అత్యధికంగా 250 టీఎంసీల నీరు రాగా.. 199 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

జలకళ

గత మూడేళ్లుగా ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎస్సారెస్పీ చరిత్రలోనే తొలిసారి ప్రాజెక్టు గేట్లు 12 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు గేట్లు 15ఫీట్ల వరకు ఎత్తే వీలుండగా.... ఒకేసారి 42 గేట్లు ఎత్తితే 16లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఈ ఏడాది భారీ వర్షాలతో రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్ల గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ప్రధాన గేట్లు మూసేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 25, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.