ETV Bharat / city

RAIN ALERT: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

author img

By

Published : Jul 16, 2021, 5:13 AM IST

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల రోజులు కురవాల్సిన వానలు ఒక్కరోజులోనే కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాల్లోనూ వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా మెదక్ జిల్లా చేగుంటలో 21.6 సెం.మీ. వర్షం పడింది. భారీ వర్షాలకు ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 12 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

RAIN ALERT
RAIN ALERT

రెండు మూడు రోజులుగా ముసురు పట్టిన రాష్ట్రంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వానలు దంచికొట్టాయి. ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా వంతెనలు తెగాయి. చెరువు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలను వరద ముంచెత్తింది. ఇటీవల నాట్లేసిన వరి చేలు, మొక్కజొన్న, కంది, కూరగాయ పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయా గ్రామాల మధ్య రోడ్డుపై ఉన్న లోతట్టు వంతెనలు మునిగిపోవడంతో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల అప్రోచ్‌ రహదారులు వరద ఉద్ధృతికి తెగిపోవడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. 12 జిల్లాలకు వాతవరణ శాఖ హెచ్చరిక

నీటిలో ఎనిమిది మంది..

జగిత్యాల జిల్లాలో వరద నీటిలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. మల్లాపూర్ మండలం పరిధిలో పెద్ద వాగుల వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో... వివిధ పనులకు వాగు అవతలి వైపునకు వెళ్లిన ఎనిమిది మంది చిక్కుకున్నారు. వేంపల్లికి చెందిన కాశన్న అనే వ్యక్తి వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. మిగతా వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రి ద్వారం వరద నిలిచిపోయింది. దీంతో దవాఖానాకు వచ్చే రోగులు నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎడతెరిపి లేని వర్షాలు


నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. చెరువులు, వాగులు జలకళను సంతరించుకోగా.. ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. నిజాంసాగర్ దిగువన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. కామారెడ్డి జిల్లాలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లను వరద ముంచెత్తింది. పలు చోట్ల వాగులపై వంతెనలు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

చేగుంటలో అత్యధికంగా 216 మి.మీ. వర్షపాతం..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో పెద్దవాగు ఉప్పొంగడంతో సుమారు 2 గంటలపాటు రాకపోకలు నిలిచాయి. దీంతో డిగ్రీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చందుర్తిలో పిడుగుపాటుకు కట్ట రాధ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడలోని ప్రధాన రహదారిలో మోకాళ్ల మట్టుకు నీళ్లు నిలవడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. బుధవారం రాత్రి 4 గంటల పాటు కురిసిన వర్షం మెదక్‌ జిల్లాను వణికించింది. ప్రధానంగా చేగుంటలో అత్యధికంగా 216 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఇది రాష్ట్రంలో అత్యధికం కావడం గమనార్హం. రెండోది శివ్వంపేట మండలంలోని కొత్తపేటలో 143.5 మి.మీగా నమోదయింది.

నీట మునిగిన వరినారు మడులు..

జిల్లాలో ముఖ్యంగా చేగుంట, శివ్వంపేట మండలాల్లో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఇటీవల నాట్లు వేసిన పొలాలు వాన నీటిలో మునిగి చెరువులను తలపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. విస్తృతంగా వర్షాలు పడటంతో నీటిలో వరినారు మడులు మునిగి రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. బునాదిగాని కాల్వకు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నూతనంగా నిర్మించిన 40 రెండు పడకల గదుల భవన సముదాయం చుట్టూ వరద నీరు చేరింది.

268 ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 268 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గరిష్ఠంగా మెదక్‌ జిల్లా చేగుంట, హైదరాబాద్‌లో రెండు చోట్ల 21.6 సెం.మీటర్లు నమోదయింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో 16.1, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 15.6, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 15, యాదగిరిగుట్టలో 13.6, సరూర్‌నగర్‌లో 13 సెం.మీటర్ల వర్షం నమోదయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణశాఖ హెచ్చరికలు..

ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు... వరంగల్‌ అర్బన్‌, గ్రామీణం, మహబూబాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఇవీ చూడండి: Flow For Projects: వరద పారుతుంది.. ప్రాజెక్టు నిండుతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.