ETV Bharat / city

ఉఫ్‌కారికి ఉపకారం.. చేతివాటం ప్రదర్శిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

author img

By

Published : Jul 31, 2022, 10:46 AM IST

traffic police
traffic police

మద్యం తాగి వాహనాలు నడపకుండా కట్టుదిట్టం చేయాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు తమదైన శైలిలో నయాదందాకు తెరలేపిన వైనం మిర్యాలగూడలో వెలుగుచూసింది. మద్యం తాగే వారిని పట్టించే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్రీత్‌ అనలైజర్‌తో అక్రమాలకు పాల్పడిన బాగోతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా జరుగుతున్న దందాపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో విచారణ చేపడుతున్నారు.

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలోని ట్రాఫిక్ పోలీసులు నయాదందాకు తెరలేపారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా కట్టుదిట్టం చేయాల్సిన వారు తమదైన శైలిలో కొత్త దందాకు పాల్పడుతున్నారు. మద్యం తాగే వారిని పట్టించే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్రీత్‌ అనలైజర్‌తో అక్రమాలకు పాల్పడిన బాగోతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల శాఖ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా జరుగుతున్న దందాపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందటంతో విచారణ చేపడుతున్నారు. స్టేషన్‌లో సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలతో అక్రమాల డొంక కదిలినట్లు సమాచారం.

నయా దందా సాగే తీరిలా.. మిర్యాలగూడ ట్రాఫిక్‌ సిబ్బంది కొన్నేళ్లుగా బ్రీత్‌ అనలైజర్‌తో రోజూ ప్రధాన రహదారిపై, మద్యం దుకాణాల సమీపంలో, కూడళ్ల వద్ధ తనిఖీలు చేపడుతున్నారు. వాహనాల లైసెన్సులు, బీమా పత్రాలు, హెల్మెట్‌ తదితరాలను పరిశీలిస్తున్నారు. చిన్నాచితకా లోపాలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో కొంతమందిపై కేసులు నమోదు చేయకుండా వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు నేరుగా తీసుకుంటే దొరికిపోతామనే ఉద్దేశంతో ప్రైవేటుగా ఒక యువకుడికి నియమించటంతో పాటు స్టేషన్‌ పరిసరాల్లోని చిరువ్యాపారుల (చెప్పులు కుట్టే వ్యక్తి, బెల్టులు అమ్మే వ్యక్తి) నంబర్లకు ఫోన్‌పే, గూగుల్‌పే చేయించుకుని డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఏడాది కాలంగా దందా సాగిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఎస్సై, ఓ కానిస్టేబుల్‌ను ఎస్పీ మందలించారు. సదరు కానిస్టేబుల్‌ను జిల్లా సరిహద్దులో దూరంగా ఉన్న ఠాణాకు బదిలీ చేశారు.

వెలుగుచూసిన అక్రమాలు.. ట్రాఫిక్‌ సిబ్బంది అక్రమాలపై ఫిర్యాదులు రావటంతో బ్రీత్‌ అనలైజర్‌ యంత్రాన్ని డీఎస్పీ, సీఐ ఇటీవల పరిశీలించారు. సగటున నెలకు 85 మంది వరకు మద్యం తాగి పట్టుబడినా సిబ్బంది కేసులు నమోదు చేయకుండా వదిలేసినట్లు గుర్తించారు. చిరువ్యాపారుల గూగుల్‌ పే సమాచారం సేకరించారు. చిరు వ్యాపారుల ద్వారా పోలీసు సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. తమపై వేటుపడకుండా రాజకీయ నాయకులను సదరు పోలీసులు ఆశ్రయించి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

విచారణ జరిపిన మాట వాస్తవమే..

'ట్రాఫిక్‌ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన మాట వాస్తవమే. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం.'- వై.వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ, మిర్యాలగూడ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.