దశాబ్దాల కష్టం నీటిపాలు.. ఏ ఒక్కటీ మిగల్లేదు..

author img

By

Published : Jul 20, 2022, 8:55 AM IST

HUGE LOSS DUE TO THE FLOODS

ఆదిలాబాద్‌ మెుదలుకొని భద్రాద్రి జిల్లా వరకు పట్టణాలు సహా గ్రామాల్లో గోదావరి వరదతో... ప్రజలకు తీవ్ర కష్టాలు మిగిల్చాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వచ్చిన ప్రవాహంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం నీరు తొలగిపోయినప్పటికీ... వరద గాయాలు మానలేదు. తమకు నిలువనీడ లేని పరిస్థితి తలెత్తిదంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

దశాబ్దాల కష్టం నీటిపాలైంది.. చెమటోడ్చి.. తినీతినక.. పైసాపైసా కూడబెట్టి సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద పాలయ్యాయి. ఏళ్ల శ్రమ కళ్లెదుటే వరదార్పణం కావడంతో అనేక కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. భారీ వర్షాలు మిగిల్చిన వరద కష్టాలు అన్నీఇన్నీ కాదు. మంచిర్యాల, మంథని, జగిత్యాల, నిర్మల్‌, భద్రాచలం సహా పట్టణాలు, గ్రామాలను ఏకం చేసిన గోదావరి వరదతో వేల కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. అనేక వస్తువులు నీళ్లలో కొట్టుకుపోగా మిగిలినవి పనికిరాకుండా పోయాయి. ఈ వరద.. కుటుంబాలను ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయింది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు సహా.. ఇతర ఆశలను వరద దెబ్బతీసింది. చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, కార్మికులు కొన్నేళ్లయినా కోలుకునే పరిస్థితి లేదు. తిండిగింజలు, వంట పాత్రలు, మంచాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు సహా ఇళ్లలో ఏ వస్తువూ మిగల్లేదు. మళ్లీ వాటిని ఇప్పుడే సమకూర్చుకోగలమనే నమ్మకంలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు, భూమి పత్రాలు ఇలా సర్వం జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో వందల కుటుంబాలు కనీసం వంట సామగ్రి కూడా లేని దుస్థితిలో ఉన్నాయి. తమ గృహాలను బాగు చేసుకోవాలంటే నెలలు పడుతుందని ఆవేదన చెందుతున్నాయి. వంట పాత్రలు, ఆహారపదార్థాలు, ఇంట్లోని వస్తువులన్నింటినీ కొత్తగా కొనుక్కోవాల్సిందే. వేల రూపాయలు వెచ్చిస్తే తప్ప కనీస వసతులు సమకూరే పరిస్థితి లేకుండా పోయిందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

నేతరి జ్యోతి

ఇది మేం ఉన్న ఇల్లేనా.. కూలికి వెళ్లి బతికేవాళ్లం. ఇంట్లో వస్తువులన్నీ వరద పాలయ్యాయి. దుస్తులు లేవు, తిండిగింజలు కొట్టుకుపోయాయి. ఇంట్లో వంట సామగ్రి, టీవీ సహా అన్నీ నాశనమయ్యాయి. మొన్ననే పిల్లలకు రూ.3 వేలు పెట్టి పుస్తకాలు కొన్నాం. అవి కొట్టుకుపోయాయి. ఫంక్షన్‌ హాలులో ఉండి ఈరోజే ఇంటికి వచ్చాం. ఇది మేం ఉన్న ఇల్లేనా అనిపిస్తోంది. -నేతరి జ్యోతి, ప్రశాంత్‌నగర్‌, రామగుండం

కొమరయ్య

కొత్త ఇంటిని చూస్తే.. కూలి పనిచేసి కూడబెట్టుకుని ఇంటిని కట్టుకున్నాం. 20 ఏళ్లు అద్దె ఇంట్లో ఉండి ఆర్నెల్ల కిందటే సొంత ఇంట్లోకి వచ్చాం. ఆ ఆనందాన్ని వరద ఆవిరి చేసింది. కట్టుబట్టలతో మిగిలాం. మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో కొన్ని వస్తువులు కొట్టుకుపోగా మిగిలినవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇంటిని చూస్తే కన్నీళ్లొస్తున్నాయి. -కొమరయ్య, కూలి గణేష్‌నగర్‌, మంచిర్యాల

శంకర్‌

ఒక వస్తువూ దక్కలేదు.. ప్రాణాలతో బయటపడటమే గగనమైంది. ఇంట్లో ఏమీ మిగల్లేదు. ఆటో నడుపుకుంటూ.. తినీతినక కూడబెట్టి కొనుక్కున్న వస్తువుల్లో ఒక్కటీ లేకుండా పోయాయి. తిండిగింజలు, వంటపాత్రలు, దుస్తులు, పడకలు, టీవీ, కూలర్‌ సహా ఇంట్లో ఉన్న 6 బస్తాల ధాన్యం నీళ్ల పాలయ్యాయి. పోయిన వస్తువుల విలువ రూ.50 వేల పైనే ఉంటుంది. -శంకర్‌, ఆటోడ్రైవర్‌, మంథని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.