గూడు చెదిరింది.. గోదావరి పరీవాహకంలో పల్లెలు ఆగమాగం

author img

By

Published : Jul 20, 2022, 4:26 AM IST

Updated : Jul 20, 2022, 4:35 AM IST

గోదావరి
గోదావరి ()

Flood Effect at Bhadrachalam: భద్రాద్రి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లన్ని మట్టిముద్దలుగా మిగిలాయి. ఆనవాళ్లు కోల్పోయి బురదతో నిండిన ఇళ్లను చూసి బోరుమంటున్నారు.

Flood Effect at Bhadrachalam: వరదకు నానిపోయి.. గోడలు మట్టి ముద్దలయ్యాయి. ఇటుకలు కరిగిపోయాయి. మట్టి తడికలు కొట్టుకుపోయాయి. గోదావరి వరద ఉద్ధృతి భద్రాద్రి జిల్లాలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలో ఎక్కడ చూసినా మట్టి ముద్దలే దర్శనమిస్తున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు తమ గూడును చూసి బావురుమంటున్నారు. చెత్తాచెదారంతో, ముక్కుపుటాలదిరే దుర్వాసనతో వారి నివాసాలు స్వాగతం పలుకుతున్నాయి. విలువైన గృహోపకరణాలు, నిత్యావసర సామగ్రి పాడవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

..

భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో 7500 కుటుంబాలను వరదలు కోలుకోలేని దెబ్బతీశాయి. వందల గ్రామాలు రోజుల తరబడి మునిగిపోగా 27 వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లో ముంపు గ్రామాల బాధితులు సోమవారం మధ్యాహ్నం నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు. తమ ఆవాసాలను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గోదావరికి ఈ నెల 11వ తేదీ నుంచి భారీ వరద ప్రారంభమైంది.

అప్పటి నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు మూడో ప్రమాద హెచ్చరికకు పైగానే నీటిమట్టం కొనసాగడంతో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంది. దీంతో గోడలు, పైకప్పులు, పునాదులు బలహీనపడిపోయాయి. పెంకుటిళ్లు, పూరిపాకలకు భారీ నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల గోడల దరులు మాత్రమే కూలినట్లు కనిపిస్తున్నా కొన్నాళ్లకు నిర్మాణం మొత్తం ఇల్లంతా కుంగిపోతుందని బాధితులు వాపోతున్నారు.

బూర్గంపాడులోని ఎస్సీ కాలనీ, ఈ మండలంలోని మోతె, ఇరవెండి, తాళ్లగొమ్మూరు, బసవప్ప క్యాంపుతోపాటు పలు కాలనీలు, అశ్వాపురం మండలంలో నెమలిపాక, కుమ్మరిగూడెం, చింతిర్యాల, మణుగూరులో చిన్నరావిగూడెం, కమలాపురం తదితర గ్రామాల్లో ఇళ్లు నానిపోయాయి. పాల్వంచ మండలంలో కిన్నెరసాని పోటెత్తడంతో రంగాపురం, నాగారం, దంతెలబోర గ్రామాల్లో వరద ఇళ్లలోకి చేరింది.

పరిహారం కోసం సర్వే చేస్తున్న ప్రభుత్వ సిబ్బంది.. పూర్తిగా కూలిపోయిన ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. గోడలు, పునాదులు దెబ్బతింటే పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు నమోదు చేస్తున్నారని, ఎప్పటికైనా అవి కూలిపోతాయని ఆందోళన చెందుతున్నారు. వీటికి కూడా పూర్తినష్టం వాటిల్లినట్లు పరిగణించాలని, కొత్త ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇంటింటా నష్టమే: బాధితుల ఇళ్లలోని విలువైన పత్రాలు, దుస్తులు డబ్బు, బంగారం కొట్టుకుపోయాయి. ఏసీలు, టీవీలు ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కూలర్లు, మిక్సీలు, స్విచ్‌ బోర్డులు పాడయ్యాయి. కరెంటు వైరింగ్‌ దెబ్బతింది. మంచాలు నానిపోయి.. పరుపులు ముద్దముద్దయ్యాయి. బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. బోర్లు, మోటార్లు పనిచేసే పరిస్థితి లేదు. ప్రతి కుటుంబం సుమారు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయింది. మొత్తంగా వరదలు రూ.కోట్లలోనే ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి.

రోడ్లన్నీ ఛిద్రం: రోడ్లపై వరద నిల్వ ఉండటంతో గ్రామాలకు చేరుకునే రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. భారీ గోతులు పడ్డాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి. తారు బలహీనంగా మారింది. బూర్గంపాడు- సంజీవ్‌రెడ్డిపాలెం, సారపాక, మోతె, అశ్వాపురం-చింతిర్యాల, లక్ష్మీపురం, మణుగూరు-చిన్నరావిగూడెం, రాయగూడెం లిఫ్టు, కమలాపురం రహదారులు కొన్నిచోట్ల రూపు లేకుండా పోయాయి.

సర్వం కోల్పోయాం..

..

గోదావరి వరదలకు ఇంట్లో వస్తువులేమీ మిగల్లేదు. ఇంట్లో సామగ్రి, బియ్యం, నిత్యావసరాలు కొట్టుకుపోయాయి. ఇంటి చుట్టూ ఉన్న మట్టి గోడలు కూలిపోయాయి. నా కుమార్తె చెవి కమ్మలు కూడా కొట్టుకుపోయాయి. - ధనమ్మ, కమలాపురం, మణుగూరు

ఇల్లంతా బురదమయం..

..

వరదల ధాటికి మా ఇల్లు ఆనవాళ్లు కోల్పోయింది. ఇంట్లో దాదాపు రూ.లక్ష విలువైన గృహోపకరణాలు, సామగ్రి పూర్తిగా పాడయ్యాయి. ఇల్లంతా బురద పేరుకుపోయింది. వంట చేసుకునేందుకు బియ్యం లేవు. నిత్యావసరాలన్నీ కుళ్లిపోయాయి. - పి.దుర్గ, సారపాక సుందరయ్య కాలనీ, బూర్గంపాడు మండలం

కట్టుబట్టలతో మిగిలాం..

..

వరదల ధాటికి మా పూరిగుడిసె నేలమట్టమైంది. సామగ్రి, గృహోపకరణాలన్నీ ఇంటి కిందే ఉండిపోయాయి. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో మిగిలిపోయాం. కనీసం వండుకునేందుకు బియ్యం కూడా మిగల్లేదు. వారం రోజులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాం.- సోడి సూరిబాబు, వీరాపురం, చర్ల మండలం

ఇవీ చదవండి: కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు

నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

Last Updated :Jul 20, 2022, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.