నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

author img

By

Published : Jul 18, 2022, 5:08 PM IST

Updated : Jul 18, 2022, 5:18 PM IST

neet Female students underwear

NEET exam underwear: లోదుస్తులు తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు పేర్కొంది. ఈ ఆరోపణలపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది.

NEET dress code for female: కేరళలో నీట్ పరీక్ష హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. కొల్లం జిల్లా, ఆయుర్​లోని మాత్రోమా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంపై కోటరక్కరా డిప్యూటీ ఎస్పీకి బాధిత యువతి ఫిర్యాదు చేసింది.

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆదివారం జరిగింది. పరీక్షా హాల్​కు వెళ్లిన తమను లోదుస్తులు విప్పాలని బలవంతం చేశారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే తమను అనుమతించారని తెలిపింది. ఫలితంగా పరీక్ష సరిగా రాయలేకపోయానని ఫిర్యాదులో వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అయితే, దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్ తనిఖీలు చేసే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది. కాగా, ఆదివారం పరీక్ష పూర్తైన తర్వాత పెద్ద ఎత్తున లోదుస్తులను ఓ అట్ట పెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.

హిజాబ్ తీసేయాలని...
మరోవైపు, మహారాష్ట్రలో ముస్లిం విద్యార్థినులు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిజాబ్ ధరించి పరీక్షకు హాజరయ్యేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ తీసేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వాశిం జిల్లాలోని మాతోశ్రీ శాంతాబాయి గోటె కళాశాలలో ఈ ఘటన జరిగింది.

neet exam
మాతోశ్రీ కళాశాల సెంటర్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

కత్తిరిస్తామని బెదిరింపు..
ఇరామ్ మహమ్మద్ జాకీర్, అరిబా సమన్ ఘజన్​ఫర్ హుస్సేన్ అనే ఇద్దరు యువతులు పరీక్ష రాసేందుకు రాగా.. వారిని సిబ్బంది అడ్డుకున్నారు. తమతో అధికారులు అనుచితంగా ప్రవర్తించారని బాధిత యువతులు ఆరోపించారు. హిజాబ్ తీసేయకపోతే కత్తెరతో కత్తిరిస్తామని బెదిరించినట్లు చెప్పారు. తమతో వచ్చిన తల్లిదండ్రులతోనూ అధికారులు వాదనలకు దిగారని విద్యార్థినులు పేర్కొన్నారు.

neet exam
.

ఇదీ చదవండి:

Last Updated :Jul 18, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.