ETV Bharat / city

గ్రేటర్​లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్​

author img

By

Published : Sep 29, 2020, 4:42 PM IST

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లలో 15శాతం మంది పనితీరు అంతగా బాగోలేదని... ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఆయన... ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. గత ఐదేళ్ల కార్యక్రమాలపై ప్రగతి నివేదిక విడుదల చేస్తామని ప్రకటించారు.

trs working president ktr attend to greater hyderabad leaders meeting in jublihills
గ్రేటర్​లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్​

trs working president ktr attend to greater hyderabad leaders meeting in jublihills
బల్దియా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం

ఆన్​లైన్​లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు సహా పట్టభద్రుల ఎమ్మెల్సీ, బల్దియా ఎన్నికల సన్నద్ధతపై... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో పురపాలకశాఖ మంత్రి, తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు సమావేశమయ్యారు. ధరణి పోర్టల్​లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనేక కారణాలతో నగరవాసులకు ఆస్తులపై సంపూర్ణ హక్కులు దక్కకుండా కొన్ని సమస్యలు ఉన్నాయన్న మంత్రి... వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థిరాస్తులపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు.

ప్రగతి నివేదిక ప్రకటిస్తాం.

ఐదేళ్లుగా హైదరాబాద్ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి... అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు కేటీఆర్ వివరించారు. వేల కోట్ల రూపాయలతో తాగునీటి ఇబ్బందులు తొలగించి, వందల కోట్లతో రహదార్లను అభివృద్ధి చేసి, లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్​కు రప్పించినట్టు వెల్లడించారు. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 67వేల కోట్లు చేసిందని... ఈ కార్యక్రమాలు, పథకాలు, కల్పించిన మౌలిక వసతులు, సంబంధిత సమాచారంతో ప్రగతి నివేదిక విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల పనితీరుకు ప్రగతి నివేదిక నిదర్శనంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్దఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు సూచించారు.

ఓటరు నమోదులో పాల్గొనండి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అక్టోబర్ 1 నుంచి నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని కేటీఆర్​ పిలుపునిచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి మొదటి రోజే నమోదు చేసుకోవాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేలా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటే బల్దియా ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలని తెలిపారు. నిబంధనల ప్రకారం నవంబరు రెండో వారం తరువాత ఎప్పుడైనా గ్రేటర్ హైదరాబాద్​కు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని... అందరూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు.

పనితీరు మార్చుకోండి

వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్, పట్టభద్రుల ఓటర్ల నమోదుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే అది గ్రేటర్ ఎన్నికలకు కూడా ఉపకరిస్తుందని కేటీఆర్​ అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి... గ్రేటర్ హైదరాబాద్​లో మంచి పేరు ఉందని... సర్వేలన్నీ పూర్తి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. హీనపక్షంలో 91 సీట్లు వస్తాయని నివేదికలు చెప్తున్నాయన్న ఆయన... 15శాతం మంది కార్పొరేటర్ల పనితీరు అంతగా బాగోలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా వారు పనితీరును మార్చుకోవాలని సూచించిన కేటీఆర్... నిత్యం ప్రజల్లోనే ఉండి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు.

గ్రేటర్​లో మంచి పేరుంది.. కనీసం 91 సీట్లు గెలుస్తాం: కేటీఆర్​

ఇదీ చూడండి: 'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.