ETV Bharat / city

కేంద్రంపై తెరాస వరిపోరు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు

author img

By

Published : Apr 7, 2022, 1:55 PM IST

Updated : Apr 7, 2022, 7:05 PM IST

TRS Dharna in Telangana : యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్లిప్త వైఖరి అవలంబిస్తోందంటూ తెరాస శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కేంద్రం దిగొచ్చి మద్దతు ధరకు ఆఖరి గింజ కొనేవరకూ అవిశ్రాంతంగా పోరాడతామని గులాబీ నేతలు స్పష్టం చేశారు.

trs-protests-against-central-government-over-paddy-procurement
trs-protests-against-central-government-over-paddy-procurement

TRS Dharna in Telangana : యాసంగి వడ్లు కేంద్రం కొనేదాక వదలబోమని మరోసారి తెరాస నేతలు స్పష్టం చేశారు. దశలవారీ ఉద్యమంలో భాగంగా జిల్లాకేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. సిరిసిల్లలోని అంబేడ్కర్​ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర భాజపా నాయకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

"రైతులంతా వరి వేయాలని బండి సంజయ్‌ రెచ్చగొట్టారు. ధాన్యాన్ని సీఎం కొనాల్సిన పనే లేదని బండి సంజయ్‌ అన్నారు. కేంద్రంతో చెప్పి ప్రతి గింజ కొనిపిస్తామన్నారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే కనిపించకుండా పోయారు. భాజపా రెండు నాలుకల వైఖరిని ప్రజలు గమనించాలి. ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదని కేంద్ర మంత్రులు అంటున్నారు. ఏటా కోటి మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యాన్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల లెక్క నాదగ్గర ఉంది. తెరాస ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే అక్కసుతోనే ఈ కొత్త కిరికిరి." - కేటీఆర్‌, మంత్రి

trs-protests-against-central-government-over-paddy-procurement
సిరిసిల్ల నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్​

తెలంగాణ వికాసం వద్దా..?

సిద్దిపేట జిల్లాలో వైద్యారోగ్యశాఖ మంత్రి పాల్గొన్న హరీశ్‌రావు కేంద్రం వడ్ల విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణం మోదీ సర్కార్‌ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

"కేంద్రానికి పేదలంటే పట్టింపులేదు. రైతులంటే చిన్నచూపు. కేంద్రంలో భాజపా అధికారంలో వస్తే.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు. ఆదాయం మాట దేవుడెరుగు కానీ.. పెట్టుబడి మాత్రం రెట్టింపయ్యింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిర్రు. బావిల దగ్గర మీటర్లు పెట్టుమంటుర్రు. ధాన్యం కొనమంటుర్రు. సబ్​కా సాత్​ సబ్​ కా వికాస్​ అంటుడ్రు మరి.. అందులో తెలంగాణ లేదా. మిగతా రాష్ట్రాలకు ఓ న్యాయం. తెలంగాణకు ఓ న్యాయమా..?"- హరీశ్​రావు, మంత్రి

TRS Dharna in Telangana
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు

కేంద్రానిది కక్ష సాధింపు..

కరీంనగర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందని ఆక్షేపించారు. ఎఫ్‌సీఐని నిర్వీర్యం చేసేలా కేంద్ర విధానాలున్నాయని ఆక్షేపించారు. తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసి తీరాల్సిందేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రైతు దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతోందని మంత్రి ఆరోపించారు.

TRS Dharna in Telangana
కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్

వరికంకులతో వినూత్నంగా..

ఖమ్మం ధర్నాచౌక్‌ వద్ద రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య వరికంకులతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ బాగుపడడాన్ని చూసి ఓర్వలేకనే కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు నినాదం ఎత్తుకున్న భాజపాకు...ఒకే దేశం-ఒకే కొనుగోలు విధానం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండిన ఆఖరి వడ్ల గింజ కొనేవరకూ కేంద్రంపై పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. కేంద్రంపై నిరసనగా మేడ్చల్ జిల్లాలో తెరాస చేపట్టిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

TRS Dharna in Telangana
కేంద్రంపై పోరులో మంత్రి మల్లారెడ్డి

రైతులను ఏడిపిస్తోంది..

నల్గొండలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ పాల్గొన్నారు. కేంద్రం దిగొచ్చి వడ్లు కొనాలని నినదించారు. రైతులను ఏడిపించిన ప్రభుత్వం బాగుపడ్డాన పాపానపోలేదని దుయ్యబట్టారు. కేంద్రం చేతకాని తనంతో దేశం అర్ధాకలితో అలమటిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఆహార భద్రత చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు.

మా ఉద్యమం ఆగదు..

నిజామాబాద్‌లో నిరసనదీక్షలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ధాన్యం రైతులను ఆదుకోకుండా సమాఖ్య స్ఫూర్తి విఘాతం కలిగేలా భాజపా సర్కార్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. ధాన్యం కొంటామని మాట ఇచ్చిన రాష్ట్ర భాజపా నాయకత్వం ఎక్కడ దాక్కుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని మంత్రి ప్రశ్నించారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వరంగల్‌ సిటీ మైదానంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం జనగామకు వెళ్లిన మంత్రి అక్కడి రైతు మహా ధర్నాకు హాజరయ్యారు. ధాన్యం సేకరణలో కేంద్రం తీరుని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర విధానాలను ఎండగట్టారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహబూబ్‌నగర్‌ ఆందోళనలో పాల్గొన్న ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజాసంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని ఘాటు విమర్శలు చేశారు. ఆదిలాబాద్‌ ధర్నాలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా వడ్లను నేలపై పారబోసి ఆందోళన తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రాభివృద్ధిని చూసి భాజపా, కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. వికారాబాద్‌ చౌరస్తాలో మంత్రి సబితా రెడ్డి సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రనిధులు పాల్గొని కేంద్ర వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Last Updated :Apr 7, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.