ETV Bharat / city

ఆలమట్టికి భారీ ప్రవాహం.. నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు

author img

By

Published : Jun 20, 2021, 7:13 AM IST

The upper Krishna project huge flow to Almatti dam
ఆలమట్టికి భారీ ప్రవాహంతో నిండుకుండల్లా రాష్ట్రంలోని ప్రాజెక్టులు

ఈ ఏడాది తొలిసారి ఎగువ కృష్ణా ప్రాజెక్టు ఆలమట్టికి భారీ ప్రవాహం వస్తోంది. గురువారం 13 వేల క్యూసెక్కులు ఉన్న వరద క్రమంగా పెరిగి శనివారం నాటికి లక్ష క్యూసెక్కులను దాటింది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టికి ఎగువన కృష్ణా నది పరీవాహకంలోని ఉప నదుల నుంచి వరద వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టికి ఎగువన కృష్ణా నది పరీవాహకంలోని ఉప నదుల నుంచి భారీ ప్రవాహం వస్తోంది. గురువారం 13 వేల క్యూసెక్కులు ఉన్న వరద క్రమంగా పెరిగి శనివారం నాటికి లక్ష క్యూసెక్కులను దాటింది. గత ఏడాది కృష్ణానదికి జూన్‌ 16న వరద మొదలైంది. అయితే ఈ ఏడాది జూరాలకు ముందుగానే (ఈ నెల 5 నుంచే) ప్రవాహం ప్రారంభమైంది. నారాయణపూర్‌ జలాశయం నుంచి విద్యుత్తు ఉత్పత్తి, దిగువన ఉన్న బ్యారేజీల్లో నిల్వ కోసం నీటిని విడుదల చేయడంతో అది జూరాల జలాశయానికి వచ్చి చేరింది.

The upper Krishna project huge flow to Almatti dam
ప్రాజెక్టుల నీటి నిల్వ, ప్రవాహం వివరాలు

ప్రస్తుతం జూరాలలో 2.03 టీఎంసీల ఖాళీ మాత్రమే ఉంది. కర్ణాటకలో తుంగభద్ర నదీ పరీవాహకంలో వర్షాలు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు కూడా 21 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వారం రోజుల నుంచే ప్రవాహం ప్రారంభమైంది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు రోజుకు ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల వరకు జలాలు వచ్చి చేరుతున్నాయి. గోదావరి నదిపై ఉన్న చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం ఆనకట్ట నీటి మట్టం 45 అడుగులకు గాను 43.70 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్నాయి.

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోత...

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది నుంచి 9,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... ఐదు గేట్లు తెరిచి 3,600 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 11.95 టీఎంసీల నీరు ఉంది. కన్నెపల్లి పంపుహౌస్‌ ద్వారా 21 వేల క్యూసెక్కులను అన్నారం బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు.

అన్నారం బ్యారేజీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలకు 7.96 టీఎంసీల నిల్వ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీకి 14,650 క్యూసెక్కులు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తున్నారు. ఈ జలాశయం నుంచి మధ్య, దిగువ మానేరులకు నీటిని తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్‌తో మెదడులో 'మ్యాటర్‌' తగ్గుతోంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.