ETV Bharat / city

Health Rewind 2021: దశాబ్దాలు చవిచూడని కుదుపు.. అంతే ధైర్యంగా ఎదుర్కొన్న ఒడుపు

author img

By

Published : Dec 31, 2021, 3:12 PM IST

Health Rewind 2021: వైద్య ఆరోగ్య రంగంలో దశాబ్దాలు చూడని కుదుపును 2021 చవిచూపించింది. వేలమందిని మహమ్మారి రూపంలో బలితీసుకుంది. కరోనా సెకండ్​ వేవ్ ధాటికి ఆస్పత్రులు నిండుకుని ప్రాణవాయువు కోసం రోగులు సతమతమైన దుస్థితి ఏర్పడింది. తీవ్ర ఒడుదొడుకుల నడుమ మొట్టమొదటి ధేశీయ వ్యాక్సిన్​ని అందుబాటులోకి తెచ్చుకుని... కొవిడ్ కట్టడిలో బలంగా ముందుకు సాగాం. ఒకటా రెండా డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు కోరలు చాచినా... ఎప్పటికప్పుడు పటిష్టమైన ప్రణాళికలతో ఎదుర్కొన్నాం. దేశవ్యాప్తంగా ఆరోగ్య సూచిలో మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది తెలంగాణ. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ.. 2021లో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఓసారి చూద్దాం.

telangana health department and covid situation rewind in 2021
telangana health department and covid situation rewind in 2021

Health Rewind 2021: కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి... వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తోందన్న ఆనందం మధ్య 2021 ప్రారంభమైంది. మహమ్మారి కట్టడిలో భాగంగా జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ గణనీయంగా మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన 2.77 కోట్ల మంది జనాభా కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులైనట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. టీకాల అందుబాటు దృష్ట్యా... తొలిదశలో హెల్త్​కేర్ వర్కర్లు, ఆ తర్వాత ఫ్రంట్ లైన్, 60 ఏళ్లు పైబడిన వారికి , హైరిస్క్ గ్రూప్ ఇలా క్రమంగా 18 ఏళ్లు పైబడిన అందరికీ.. వ్యాక్సిన్లు అందించారు. మొత్తానికి డిసెంబర్​లో తొలిడోస్ వ్యాక్సిన్​ను 100 శాతం పూర్తి చేసి రికార్డు సృష్టించాం. కేవలం కోటి డోసుల నిల్వ సామర్థ్యాన్ని 3కోట్లకు పైగా నిల్వ ఉంచేందుకు మౌలిక సదుపాయాలను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కల్పించింది. ఇక ప్రస్తుతం వందశాతం తొలిడోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ.

కేసులతో మరోసారి ఆందోళన..

covid cases in telangana: 2020లో రాష్ట్రంలోకి ప్రవేశించిన కరోనా.. 2021 ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో పెను ప్రభావం చూపింది. డెల్టా వేరియంట్​తో వందల మంది ప్రాణాలను బలితీసుకుంది. కొవిడ్​తో గడచిన ఏడాది కాలంలో 3లక్షల 95వేల మందికి పైగా మహమ్మారి బారిన పడగా... అందులో దాదాపు 2500 మంది మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కరోనా కేసులు కాస్త తక్కువగానే నమోదైనా.. మార్చి నుంచి మరోమారు పంజా విసిరింది. ఏప్రిల్​లో అత్యధికంగా ఒకేరోజు రికార్డు స్థాయిలో 5 వేలకు పైగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించింది.

సెకండ్​ లాక్​డౌన్​..

second lockdown in telangana: కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మే 12న ప్రభుత్వం మరోసారి లాక్​డౌన్ విధించింది. అప్పటికే కరోనా కేసుల సంఖ్య భారీ మొత్తంలో పెరగటంతో.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇండస్ట్రీల నుంచి ఆక్సిజన్​ని సేకరించి రోగులకు అందించారు. చివరకు ఆక్సిజన్ స్థాయిలో మెరుగ్గా ఉన్నవారికి ఆస్పత్రిలో బెడ్స్ ఇవ్వకుండా ఇంటి వద్దే చికిత్స అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ప్రతి బెడ్​కి ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించే దిశగా ప్రణాళిక చేపట్టిన సర్కారు.. ఇప్పటికే 25 వేలకు పైగా పడకలకు ఆక్సిజన్​ని ఏర్పాటు చేసింది.

మౌలిక సదుపాయాల కల్పన..

రెండో వేవ్​కి ముందు కేవలం పదుల సంఖ్యలో వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సుమారు 2 వేల వరకు వెంటిలేటర్లను సిద్ధం చేయటం గమనార్హం. మరోవైపు మూడోవేవ్ వస్తే చిన్నారులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. పిల్లల కోసం 6వేల పడకలను సిద్ధం చేశారు. వీటితో పాటు బస్తీ దవాఖానాల సంఖ్యను 226కి పెంచిన సర్కారు... 8 వైద్య కళాశాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది.

క్యూ కట్టిన కొత్త రోగాలు..

కరోనాతో పాటు ఈ ఏడాది బ్లాక్​ఫంగస్, సీజనల్ వ్యాధులు గజగజలాడించాయి. రెండో వేవ్​లో కొవిడ్ సోకిన వారికి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు వారికి రెమిడెసివిర్ అందించారు. ఈ మందు కొరత ఏర్పడటంతో.. పదివేలు కూడా లేని ఇంజిక్షన్​ని బ్లాక్​మార్కెట్​లో 50 వేల నుంచి లక్ష వరకు అమ్మి చాలా మందిని దోచుకున్నారు. ఇక స్టిరాయిడ్ల ప్రభావంతో వందల సంఖ్యలో బ్లాక్​ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా సరోజినీ దేవి, కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రుల్లో బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. మ్యూకోర్ మైకోసిస్ నియంత్రణలో వాడే మందులు సైతం సరైన మొత్తంలో అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. వీటికి తోడు స్టెరాయిడ్ల ప్రభావంతో బ్లాక్​ఫంగస్​తో పాటు.. రక్తంలో గడ్డలు ఏర్పడటంతో ఊపిరితిత్తులు, గుండె రక్తనాళాలు, పేగుల్లో రక్తం గడ్డలు ఏర్పడిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు డెంగీ వ్యాధి ఈ ఏడాది ప్రజలపై విరుచుకుపడింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో డెంగీ బాధితులతో ఆస్పతులు నిండాయి.

బాధ్యతల బదిలీలు..

ఇక ఈ ఏడాది జూన్​లోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్​ను తొలగించి ఆ బాధ్యతలను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. నవంబర్​లో.. మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. ఫలితంగా ఒకే ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ముగ్గురి చేతులు మారినట్టైంది.

కొత్త ఆస్పత్రుల ప్రారంభం..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు అవసరమైన పరీక్షలు చేసే లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్స్​కి అనుబంధంగా.. 8 మినీ డయాగ్నోస్టిక్ ల్యాబ్​లు తేవాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే పలు చోట్ల మినీ ల్యాబ్​లను ప్రారంభించింది. ఇక వరంగల్​లో భారీ హెల్త్​హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సర్కారు.. 1100 కోట్లతో తొలిదశ పనులను మొదలుపెట్టింది. మరోవైపు భాగ్యనగర నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సిద్ధం చేయనున్నట్టు ప్రకటించిది. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వ విభాగంలో ఎలర్జీ క్లినిక్​ని ప్రారంభించి... ప్రతి బుధవారం చెస్ట్ ఆస్పత్రిలో ఎలర్జీ క్లినిక్ సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్​ని అందుబాటులోకి తీసుకువచ్చి.. ఇద్దరు రోగులకు దిగ్విజయంగా స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు. భారతదేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న మూడో స్కిన్ బ్యాంక్ ఉస్మానియాదే కావటం గమనార్హం.

ఆకాంక్షలతో కొత్త ఏడాదిలోకి అడుగు..

ఇక కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటున్న తరుణంలో 2021 చివరిలో ఒమిక్రాన్ రూపంలో మరోసారి భయపెడుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా చూడని విపత్తును తీసుకువచ్చిన 2021... వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలపరంగా అంతే అభివృద్ధిని చూపించింది. ఇక ఒమిక్రాన్.. కరోనాకు చివరి అంకం కావచ్చన్న అంచనా నేపథ్యంలో ఈ ఏడాదిలో అయినా మహమ్మారికి అంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మాస్కు, పరిశుభ్రత, వ్యాక్సినేషన్​తో మహమ్మారిని కట్టడి చేయొచ్చు. మన చెంత ఉన్న ఆయుధాలను సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి మనల్నే కాదు.. సమాజాన్ని కాపాడతామన్న లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.