ETV Bharat / city

యాసంగి ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారుద్దామా?

author img

By

Published : Apr 8, 2022, 6:48 AM IST

Rabi Paddy Procurement
Rabi Paddy Procurement

Rabi Paddy Procurement : రైతుల పాలిట ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కర్షకులు కష్టాల పాలవ్వకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర సర్కార్.. ఎగుమతిదారులు, మిల్లర్లతో రబీ ధాన్యం ఏం చేయాలనే దానిపై మంతనాలు సాగిస్తోంది. యాసంగి వడ్లను సాధారణ బియ్యంగా మార్చే అవకాశాలపై చర్చలు జరుపుతోంది. మరోసారి టెస్ట్ మిల్లింగ్ చేయించే యోచన చేస్తోంది.

Rabi Paddy Procurement : యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతిదారులు, మిల్లర్లతో మంతనాలు సాగిస్తోంది. రైతులు అవస్థలు పడకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. యాసంగి వడ్లను సాధారణ బియ్యంగా మార్చేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తోంది. మార్చి నెలతో ముగిసిన ప్రస్తుత యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు వ్యవసాయశాఖ నిర్ధారించింది. సుమారు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సుమారు 47 లక్షల టన్నుల వరకు బియ్యం వస్తాయి. తేమ శాతం తగ్గిపోవటంతో సాధారణ బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువగా వచ్చి నష్టపోతామని మిల్లర్లు చెబుతున్నారు. ధాన్యాన్ని మరోదఫా ప్రయోగాత్మకంగా మిల్లింగ్‌ చేయిస్తే స్పష్టత వస్తుందన్న ఆలోచన అధికార వర్గాల్లో ఉంది. 2015లో ఒకదఫా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో టెస్ట్‌ మిల్లింగ్‌ చేయిస్తే క్వింటా వడ్లకు సగటున 66 శాతం వరకు బియ్యం వచ్చాయి. అందులో 20 నుంచి 25 శాతం నూకలున్నాయి. అప్పట్లో చెరువులు, బోర్ల కింద రైతులు వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉన్నందున మరోసారి టెస్ట్‌ మిల్లింగ్‌ చేస్తే బియ్యం 66 శాతం కన్నా ఎక్కువగానే వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

భారీగా కొనేవారి గురించి ఆరా : తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం భారీగా కొనగలిగే వారి గురించి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎగుమతిదారులున్నందున.. తెలంగాణ నుంచి ధాన్యం కొనే అవకాశాలపై వారితో మంతనాలు సాగించింది. అయితే, కనీస మద్దతు ధరకు తీసుకునేందుకు వారంతగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఎగుమతులకు రవాణా ఛార్జీలు గణనీయంగా పెరగటంతో గిట్టుబాటు కాదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ-వేలమైతే భారీగా నష్టం : రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొని ఈ-వేలం ద్వారా విక్రయిస్తే భారీగా నష్టం వస్తుందని అధికారులు తేల్చినట్లు తెలిసింది. కనీస మద్దతు ధర రూ.1,960గా ఉంది. రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన మొత్తాన్ని ఈ-వేలం ద్వారా క్వింటా రూ.1,300-1,600 మధ్య ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న పరిస్థితి నేపథ్యంలో ఈ-వేలం ద్వారా పూర్తిగా ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తే సర్కారుపై మరింత భారం పడే అవకాశముంది. ధాన్యాన్ని సాధారణ బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువ వస్తాయని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాకు రూ.200-250 మధ్య చెల్లిస్తే నూకల నష్టానికి సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మిల్లర్లు ప్రభుత్వానికి ప్రతిపాదన ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం ఎంత వరకు ముందుకొస్తుందో తేలాల్సి ఉంది. మునుపటి మాదిరిగా ప్రభుత్వం కొనుగోలు చేసి వ్యాపారులకు ఇవ్వటం మరో పరిష్కారంగా ఉంది.

పెరుగుతున్న కొనుగోళ్లు : ప్రస్తుత యాసంగిలో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1,960 కాగా, ప్రస్తుతం రైతులకు రూ.1,500- 1,600 వరకు మాత్రమే లభిస్తోంది. ప్రస్తుతం విక్రయానికి వచ్చే ధాన్యంలో సింహభాగం సన్న రకమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.