ETV Bharat / city

రూ.5కే ఆసుపత్రుల్లో రోగి సహాయకులకు భోజనం

author img

By

Published : Apr 19, 2022, 3:54 PM IST

Updated : Apr 20, 2022, 6:11 AM IST

government hospitals
government hospitals

15:51 April 19

5 రూపాయలకే నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వ ప్రకటన

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు ఇక రూ.5కే శుద్ధమైన, నాణ్యమైన భోజనం మూడు పూటలా అందనుంది. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 సర్కారు దవాఖానాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధి చేకూరుతుందని వైద్యశాఖ అంచనా వేసింది. ఒక్కొక్కరికి మూడు పూటలా అంటే మొత్తంగా రోజుకు 55,800 భోజనాలకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఒక్కో భోజనం ఖరీదు రూ.24.25కాగా..రూ.19.25 రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.38.66 కోట్లను సర్కార్‌ భరించనున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ఈ భోజనాలను హరే కృష్ణ మూవ్‌మెంట్‌ స్వచ్ఛంద సంస్థ సరఫరా చేస్తుంది. దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాన్ని హరే కృష్ణ సంస్థతో ప్రభుత్వం తరఫున మంగళవారం రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) కుదుర్చుకుంది. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

రూ.15తో మూడు పూటలా..
ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్‌ పలావ్‌, సాంబార్‌ రైస్‌తో పాటు పచ్చడిని అల్పాహారంగా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నం, సాంబార్‌ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి వడ్డిస్తారు. వాడి పడేసే ప్లేట్‌ను, గ్లాస్‌నూ అందజేస్తారు.రూ.15కే 3 పూటలా భోజనం లభిస్తుంది.

రూ.5 భోజనం లభించే ప్రభుత్వాసుపత్రులు..
1.ఉస్మానియా, 2.నిలోఫర్‌, 3.సరోజినీ, 4.పేట్లబురుజు (ప్రసూతి), 5.గాంధీ 6.ఎంఎన్‌జే 7.ఛాతీ 8.ఈఎన్‌టీ 9.ఫీవర్‌ 10.సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి 11.నిమ్స్‌ 12.టిమ్స్‌ 13.కింగ్‌కోఠి 14.మలక్‌పేట 15.గోల్కొండ 16.వనస్థలిపురం 17.కొండాపూర్‌ 18.నాంపల్లి.

10 రోజుల్లో అందుబాటులోకి: ప్రభుత్వ ఆసుపత్రుల వెలుపల ఉండే రోగులకు, వారి సహాయకులకు ఎటువంటి రాజీ పడకుండా నాణ్యమైన భోజనాన్ని అందజేస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హరే కృష్ణ సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని వారం, 10 రోజుల్లో ప్రారంభించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో హరే కృష్ణ సంస్థ సీఈవో కాంతేయ దాస ప్రభు, ధనుంజయ దాస ప్రభు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండీ చంద్రశేఖరరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Apr 20, 2022, 6:11 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.