ETV Bharat / city

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ఆరో విడత హరితహారం

author img

By

Published : Jun 23, 2020, 6:43 AM IST

telanagana government preparing for sixth phase harithaharam
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ఆరో విడత హరితహారం

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రంలో ఆరో విడత హరితహారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వర్షాకాలం ఆరంభమైనందున... ఊరూరా విరివిగా మొక్కలు నాటేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ముందస్తుగానే ప్రజాప్రతినిధులు సన్నాహక కార్యక్రమాలతో... నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 30కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఈ నెల 25న ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో... రాష్ట్రవ్యాప్తంగా హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్యక్రమ సన్నాహాలు, నర్సరీల్లో పరిస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షిస్తున్నారు.

గ్రేట‌ర్ హైదరాబాద్‌ పరిధిలో ఏర్పాట్లపై జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మేయర్‌ రామ్మోహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ప్రజ‌ల కార్యక్రమంగా హ‌రిత‌హారాన్ని అమ‌లు చేసేందుకు కార్పొరేట‌ర్లు చురుకైన పాత్ర పోషించాల‌న్న ఆయన... హైదరాబాద్‌లో రెండున్నర కోట్ల మొక్కలు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్ట చెప్పారు. న‌గ‌రంలో 700 ట్రీ పార్కులు, వీటిలో 75 చోట్ల యాదాద్రి మోడ‌ల్ ప్లాంటేష‌న్ చేయించనున్నట్టు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌లో అటవీశాఖ నిర్వహించిన సన్నాహాక సమావేశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ ఏడాది మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న ఆయన... గ్రామాల్లో తాటి, ఈత మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ దుండిగల్‌లో హరితహారం ఏర్పాట్లను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు... మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. మెదక్‌లో హరితహారం అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి వాల్‌పోస్టర్లు విడదల చేశారు. కరీంనగర్‌లో మొక్కలు నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లను మేయర్‌తో కలిసి కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఉజ్వల పార్కు, మానేరు డ్యాంపై మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో హరితహారం ఏర్పాట్లను కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: ఉద్యమ స్ఫూర్తితో ఆరో విడత హరితహారం: ఇంద్రకరణ్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.