ETV Bharat / city

గురుపూజోత్సవం: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన గురువులు

author img

By

Published : Sep 5, 2020, 7:41 AM IST

teachers day special story
గురుపూజోత్సవం: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన గురువులు

గురువు అంటే... భావిభారత సమాజ నిర్మాత.. పిల్లలను సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దేవాడు.. విద్యార్థులకు పాఠాల బోధనకే పరిమితమవకుండా తమ పాఠశాలలను సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు పలువురు గురువులు. వారి అంకితభావంతో సర్కారీ బడులు రూపురేఖలు మార్చుకుని ప్రైవేటుకు దీటుగా ఎదుగుతున్నాయి. ఈ సందర్భంగా కొందరి కృషిని పరిశీలిస్తే..

అందమైన పాఠశాల భవనం.. విశాలమైన తరగతి గదులు.. చుట్టూ పచ్చదనం.. కంప్యూటర్‌ ల్యాబ్‌.. పదో తరగతిలో ఏటా ఉత్తమ ఫలితాలు.. ఇదీ! యాప్రాల్‌ సమీపంలోని కౌకూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పురోగతి. దీని వెనుక ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణమూర్తి కృషి ఉంది. 2015లో ఇక్కడ బాధ్యతలు తీసుకోకమునుపు 160 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు 225. తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు.

తల్లిదండ్రులను కలిసి విద్యార్థులను పాఠశాలకు పంపేలా కృషి చేశారు. ప్రభుత్వ, దాతల నిధులు కలిపి అదనపు తరగతి గదులు నిర్మించేలా కృషి చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటుచేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సహకారంతో ప్రతి 3 నెలలకు వైద్య పరీక్షలు చేయించి ఔషధాలు ఇప్పిస్తున్నారు. ప్రతిభావంతులకు ఉపకార వేతనాలిస్తున్నారు. 1996లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన 2009లో హెచ్‌ఎంగా పదోన్నతి సాధించారు. గతంలో శామీర్‌పేట లక్ష్మాపూర్, అంతారంలోనూ పనిచేశారు. ఈ ఐదేళ్లలో రూ.45లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగలిగారు.
* లయన్స్‌క్లబ్, రోటరీక్లబ్, ప్రాజెక్టు, ఈసీఐఎల్‌ వంటి 40 వరకు స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి పాఠశాలకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి గదిని డిజిటల్‌గా మార్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.

బోధన, బడి అభివృద్ధిలోనూ ‘రాజే’

సైన్స్‌ ఉపాధ్యాయుడిగా 1996లో బోధన వృత్తిలోకి ప్రవేశించారు సీహెచ్‌.రవీందర్‌రాజు. 2015 నుంచి మేడ్చల్‌ మండలం గౌడవెల్లి పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. తోటి ఉపాధ్యాయుల సహకారానికి తోడు అగస్త్య, ప్రాజెక్టు కృషి, స్ఫూర్తి, రాబిన్‌హుడ్‌ ఆర్మీ, ప్యూర్, హై5 తదితర ఫౌండేషన్లు, ఐటీ కంపెనీల తోడ్పాటుతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేయించారు. జయసూర్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ కేంద్రం ఏర్పాటైంది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఒకే ఒక్క కేంద్రం ఇది. డిక్షనరీల పంపిణీ, బాలికలకు శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నారు. పదో తరగతిలో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత. గతంలో 212గా ఉన్న విద్యార్థులు ఇప్పుడు 430.

ఆ పిల్లలు ఈ బడికే వస్తారు

షాద్‌నగర్‌ శివారు పెద్ద పెద్దపల్గుట్ట తండా ప్రాథమిక పాఠశాల ఆకట్టుకుంటోంది. చుట్టుపక్కల పిల్లలెవరూ ఈ బడికి తప్ప మరెక్కడికీ వెళ్లరు. దీని వెనుక 2011లో ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయురాలు సుమతమ్మ, 2015లో బదిలీపై వచ్చిన రవిల కృషి ఉంది. దాతలు, స్థానిక నాయకుల సహకారంతో పాఠశాలను నందనవనంగా తీర్చిదిద్దారు. ఏడేళ్ల క్రితం 29 మంది పిల్లలు ఉండగా ఇప్పుడు 60 మంది. బీహెచ్‌ఈఎల్‌ సాయంతో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. బుధ, శనివారాలు క్రీడా కార్యక్రమాలు. 60 డెస్కులు తయారుచేయించారు. పాఠశాలలోనే కూరగాయలు పండించి మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు.

ఆన్‌లైన్‌ బోధనపై సూచనలిలా..

తల్లిదండ్రుల సహకారం ముఖ్యం

ప్రభుత్వ పాఠశాలల తరపున విద్యార్థులకు డిజిటల్‌ పాఠాల బోధన జరుగుతోంది. ఇంట్లో ఉండి పాఠాలు ఏ మేరకు నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులు గమనిస్తుండాలి. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పాఠాలు చూపించే వీలు కల్పించాలి. చాలా మంది పిల్లలకు ఇవి లేవని తేలింది. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని అందించే వీలు కల్పిస్తే బాగుంటుంది. మా పాఠశాల తరఫున టీచ్‌ ఫర్‌ ఇండియా సంస్థ సహకారంతో వాటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. - పద్మప్రియ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత-2020

సీఎస్‌ఆర్‌ సాయం తీసుకోవాలి
ఫోన్లు లేదా టీవీలు లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద వాటిని ఇచ్చేలా చేయగలిగాలి. ప్రస్తుతం ఇస్తున్న పాఠాలన్నీ రికార్డు చేసి ప్రీలోడెడ్‌ ట్యాబ్‌లు అందించేలా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వైఫై సౌకర్యం కల్పించాలి. చరవాణి ఉన్న వారికే వర్క్‌షీట్లు అందుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఇచ్చే పరిస్థితి లేదు కనుక ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. కమ్యూనిటీ స్థాయిలోనూ మార్పు రావాలి. కేరళలో ఈ ప్రయత్నం విజయవంతంగా అమలు చేస్తున్నారు. మన వద్దా స్థానికంగా ఉండే యువజన సంఘాలు ముందుకొచ్చి బడిఈడు పిల్లలకు పాఠాలు అందించే వెసులుబాటు కల్పించాలి. - ఆశాలత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత-2019

ఇవీ చూడండి: గురుపూజోత్సవం: పాఠమే ప్రాణం.. బడితోనే బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.