ETV Bharat / city

మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

author img

By

Published : Aug 12, 2022, 7:35 PM IST

political parties strategies on munugode by election
political parties strategies on munugode by election

Munugode bypoll రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక కోసం పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఈనెల 20న భారీ బహిరంగసభ నిర్వహించ తలపెట్టిన తెరాస ఆమేరకు సన్నాహాలను ముమ్మరం చేసింది. ఆ మరుసటి రోజే భాజపాలో చేరేందుకు సిద్ధమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక కోసం వరస సమావేశాలు నిర్వహిస్తోంది.

మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు

Munugode bypoll: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస... ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు సిద్ధమైంది. ఈనెల 20న 'మునుగోడు ప్రజాదీవెన' పేరుతో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న ఈ సభ ఏర్పాట్లపై మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టిసారించారు. తెరాస నేతలతో కలిసి మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురంలో స్థల పరిశీలన చేశారు. సభ విజయవంతానికి మండలాల వారీగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. తన స్వార్థం కోసం ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. మునుగోడు కోసమని చెప్పడం విడ్డూరంగా ఉందని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వామపక్షాలు సైతం తమకే మద్దతివ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.

మునుగోడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. తాను చేసిన త్యాగంతోనే.. నియోజకవర్గ అభివృద్ధి జరగనుందని ధీమా వ్యక్తంచేశారు. ఈనెల 21న భాజపాలో చేరుతున్నానని స్పష్టంచేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఉపఎన్నికలో ప్రజలిచ్చే చారిత్రక తీర్పుతో కేసీఆర్​ పతనం ప్రారంభమవుతుందన్నారు.

"నేను చేసిన త్యాగం వల్లే రాష్ట్రమంతా మునుగోడు గురించి చర్చిస్తోంది. నేను రాజీనామా చేయటం వల్ల ఉపఎన్నిక వచ్చింది కాబట్టే.. మునుగోడుకు సీఎం కేసీఆర్​ వస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు తెలుసుకోనున్నారు. లేకపోతే.. గతంలో మునుగోడును పట్టించుకున్నారా..? మా బాధ చెప్పుకునేందుకు కనీసం అపాయింట్​మెంట్​ అయినా ఇచ్చారా..? నియోజకవర్గ సమస్యలు ఎప్పుడైనా విన్నారా..? నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేశాను. ఈ నెల 21న భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి భాజపాలో చేరుతున్నా." - కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థి ఎవరన్నది త్వరగా తేల్చే పనిలో నిమగ్నమైంది. ఆశావహుల్లో కీలకంగా ఉన్న పాల్వాయి స్రవంతితో.. ఏఐసీసీ కార్యదర్శులు గాంధీభవన్‌లో చర్చలు జరిపారు. వ్యూహరచన కమిటీ సమావేశ సారాంశాన్ని, అభ్యర్థుల ఎంపికపై సర్వేల్లో తేలిన అంశాలను ఆమెకు వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్.... ఆధ్వర్యంలో పాదయాత్రతో పాటు మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలపై చర్చించారు. రాజగోపాల్‌రెడ్డి తన స్వార్థం కోసమే పార్టీ మారారనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.