ETV Bharat / city

నలుగురు పీఎఫ్​ఐ సభ్యుల విచారణకు ఎన్​ఐఏకు అనుమతి

author img

By

Published : Sep 28, 2022, 3:57 PM IST

NIA CUSTODY PETITION ACCEPTED: తెలుగు రాష్ట్రాల్లో అరెస్టైన పీఎఫ్​ఐ సభ్యులు నలుగురిని విచారించేందుకు ఎన్​ఐఏ కోర్టు.. ఎన్​ఐఏ అధికారులకు అనుమతి ఇచ్చింది. ఈనెల 20న వేసిన పిటిషన్​పై విచారణ అనంతరం వారిని 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. కోర్టు నిర్ణయంతో ఎన్​ఐఏ అధికారులు నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్నారు.

NIA CUSTODY
NIA CUSTODY

NIA CUSTODY PETITION ACCEPTED: అతివాద సంస్థ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ) కార్యాలయాలు, నేతల ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్​ఐఏ దాడులు కొనసాగుతున్న వేళ తెలుగు రాష్ట్రాలకు చెందిన నిందితులను విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 18న తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోనే 38 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ యాహియా సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ ఇర్ఫాన్‌లను కోర్టులో హజరుపరిచిన పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నలుగురిని 30 రోజుల కస్టడీ కోరుతూ..... ఈ నెల 20న ఎన్​ఐఏ పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నలుగురిని అధికారులు మాదాపూర్‌లోని ఎన్​ఐఏ కార్యాలయానికి తీసుకువెళ్లి, విచారణ జరుపుతున్నారు.

మరోవైపు పీఎఫ్​ఐ దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది.

అసలేంటీ పీఎఫ్​ఐ?
2006లో కేరళలో ఏర్పాటైంది పీఎఫ్​ఐ. ప్రస్తుతం దిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యమని ఆ సంస్థ చెబుతూ ఉంటుంది. కానీ.. దేశంలోని భద్రతా సంస్థల వాదన మాత్రం భిన్నం. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందన్నది ప్రభుత్వ వర్గాల ప్రధాన ఆరోపణ.

ఇవీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.