ETV Bharat / city

సర్కారు బడుల్లో కంప్యూటర్​ విద్యపై నిర్లక్ష్యం.. ల్యాబ్​ల ఏర్పాటులో అశ్రద్ధ

author img

By

Published : Apr 3, 2022, 8:14 AM IST

computer education
కంప్యూటర్ విద్య

Neglect of Computer Education in Government Schools: విద్యార్థులకు కంప్యూటర్​ విద్యను అందించడంపై ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కంప్యూటర్​ ల్యాబ్​ల కోసం కేంద్రం నిధులు కేటాయించినా.. వాటిని పూర్తిగా వినియోగించలేదు. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు కంప్యూటర్​ నేర్చుకుంటున్నా.. సర్కారు బడుల్లో మాత్రం ఆరోతరగతి నుంచైనా వారికి కంప్యూటర్​.. అందని ద్రాక్ష పండు చందంగా మారింది.

Neglect of Computer Education in Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లోని 6-10 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించడంపై దేశవ్యాప్తంగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కేంద్ర విద్యాశాఖ సమగ్ర శిక్షాఅభియాన్‌ కింద నిధులు మంజూరు చేస్తున్నా వాటిని ఖర్చు చేయడంలో పలు రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. కరోనా పరిస్థితులు తగ్గి గత సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన తెలంగాణలోనూ కంప్యూటర్‌ ల్యాబ్‌లు, స్మార్ట్‌ తరగతి గదుల ఏర్పాటుకు నిధులు పూర్తిగా ఖర్చు చేయకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ ల్యాబ్‌ల కోసం గత 4 ఆర్థిక సంవత్సరాలకు కేంద్రం రూ.3399.70 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆ వ్యవధిలో దేశంలో 64 శాతం నిధులే వినియోగమయ్యాయి. ఒక్కో కంప్యూటర్‌ ల్యాబ్‌(ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ-ఐసీటీ ల్యాబ్‌)కు రూ.1.80 లక్షలు, స్మార్ట్‌ తరగతి గదికి రూ.2.40 లక్షలు కేటాయించారు. రాష్ట్రంలో 2021-22లో 2171 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం దిశగా అడుగు ముందుకు పడలేదు.

స్మార్ట్‌ తరగతుల ఏర్పాటులో ఘోరం: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతి గదులు ఏర్పాటు చేయాలని కేంద్రం 2020-21 నుంచి ఎస్‌ఎస్‌ఏ కింద నిధులు కేటాయిస్తోంది. వివిధ రాష్ట్రాలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.956.80 కోట్లకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది. వాటిల్లో జనవరి నెలాఖరుకు కేవలం రూ.16 కోట్లను రాష్ట్రాలు ఖర్చు చేశాయి. హరియాణా, నాగాలాండ్‌, రాజస్థాన్‌, సిక్కిం మాత్రమే నిధులను వినియోగించుకోవడం ప్రారంభించాయి. తెలంగాణకు 3010 పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతి గదుల కోసం రూ.72.20 కోట్లు మంజూరు చేయగా.. అసలు ఖర్చు చేయలేదు. కానీ తర్వాత సంవత్సరం వీటిని వాడుకోవచ్చు.

నిధులను వినియోగించుకోకపోవడానికి సమగ్ర శిక్షా అభియాన్‌ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. విద్యార్థులకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా 2021-22 విద్యాసంవత్సరంలో నిధులు విడుదల చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో మొదటి తరగతి నుంచే కంప్యూటర్‌ విద్యను అలవాటు చేస్తుండగా.. సర్కారు బడుల్లో కనీసం ఆరో తరగతి నుంచి కూడా అందించకపోతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నిధుల కేటాయింపు

ఇదీ చదవండి: ఏడేళ్లకే యూట్యూబ్‌ స్టార్‌.. ఉత్తమ నటన పిల్లల విభాగంలో అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.