ETV Bharat / city

'అమరులకు నివాళులర్పించే సంప్రదాయం తెచ్చేలా స్మారకం'

author img

By

Published : Feb 1, 2021, 7:40 PM IST

Updated : Feb 1, 2021, 9:01 PM IST

హైదరాబాద్​లోని​ హుస్సేన్​సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి ప్రశాంత్​రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రపంచమే అబ్బురడేలా హుస్సేన్​సాగర్ తీరాన పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. దిల్లీలో బాపూజీకి నివాళి అర్పించే తరహాలో ఇక్కడ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం రావాలన్నారు.

Martyrs' monument in hyderabad
Martyrs' monument in hyderabad

సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా... అమరవీరుల త్యాగం ప్రతిబింబించేలా స్మారక చిహ్న నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని​ హుస్సేన్​సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల పురోగతిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షాసమావేశం నిర్వహించారు.

ఎవరొచ్చినా నివాళి అర్పించేలా...

ప్రపంచమే అబ్బురడేలా హుస్సేన్​సాగర్ తీరాన పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎవరు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేలా స్మారకం ఉండాలన్నదే సీఎం ఆలోచన అని వెల్లడించారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రముఖులు... హైదరాబాద్ వస్తే తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని ప్రశాంత్​రెడ్డి తెలిపారు. దిల్లీలో బాపూజీకి నివాళి అర్పించే తరహాలో ఇక్కడ అమరవీరులకు నివాళి అర్పించే సంప్రదాయం రావాలన్నారు.

3 అంతస్తుల్లో... 3 లక్షల చదరపు అడుగుల్లో...

అమరవీరుల స్మారకం విభిన్నంగా నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. 350 కార్లు, 600 ద్విచక్రవాహనాలు నిలిపేలా పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మొదటి అంతస్తులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, సమావేశ మందిరం, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయన్నారు. రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు ప్రతిబింబించేలా సందర్శకుల కోసం ఫొటో గ్యాలరీ ఉంటుందన్నారు. రెండో అంతస్తులో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా బెస్ట్ కన్వెన్షన్ హాల్ ఉంటుందన్నారు. మూడో అంతస్తులో రెస్టారెంట్స్ ఉంటాయన్నారు. సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కొనసాగుతుందన్నారు.

వీలైనంత త్వరగా...

అమరుల త్యాగాలు వెలకట్టలేనివని... వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నిర్మాణం ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా బాధ్యతగా భావించి పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అధికారులను ఆదేశించారు. పనుల్లో రోజు వారి అప్​డేట్స్​ మంత్రికి తెలియజేయాలన్నారు. నాణ్యత లోపం లేకుండా చూడాలన్నారు. ఆకస్మికంగా ఫీల్డ్ విజిట్ చేస్తామని.. అధికారులు, వర్క్ ఏజన్సీ సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు.

ఇదీ చూడండి: రెండు పడక గదుల నిర్మాణాలపై మంత్రి ఈటల ఆరా

Last Updated : Feb 1, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.