ETV Bharat / city

'రైతు మార్కెట్​కు వెళ్లడం కాదు కల్లానికే మార్కెట్ రావాలన్నదే సీఎం ఆలోచన'

author img

By

Published : Apr 21, 2022, 5:14 PM IST

minister niranjan reddy on alternative crops
ప్రత్యామ్నాయ పంటలపై మంత్రి నిరంజన్​ రెడ్డి

Minister Niranjan Reddy on Alternative crops: రైతు పంటతో మార్కెట్​కు వెళ్లకుండా.. కల్లం వద్దకే మార్కెట్​ రావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచన అని... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కురచబుద్దితో తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని.. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లాభసాటి పంటలు వేయాలనేదే తమ ఉద్దేశంగా చెప్పారు. కొందరు రైతులు అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

Minister Niranjan Reddy on Alternative crops: రాష్ట్రంలో వరి సాగుపై ఆంక్షలు కాదు... లాభసాటి వ్యవసాయ పంటలే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్న అన్నదాత మాత్రమే కాదని... వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే స్పూర్తిప్రదాత కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షగా పేర్కొన్నారు. పంటతో రైతు మార్కెట్ వెళ్లడం కాదని కల్లానికే మార్కెట్ రావాలన్నదే సీఎం ఆలోచన అని చెప్పారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి కొందరు స్వార్థపరులకు అర్థం కాకపోయినా.. రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటల దిశగా సాగటం హర్షణీయమన్నారు. వరికి బదులు మంచి లాభదాయకంగా ఉన్న పత్తి, కంది, పెసలు, మినుముల పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

అందులో నిజం లేదు: వరి సాగుతో పోలిస్తే తక్కువ శ్రమ, పెట్టుబడి, పంట కాలంలో రైతులకు ఎక్కువ లాభం కళ్ల ముందు కనిపిస్తుందని.. రైతులను ఆ దిశగా ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతని మంత్రి నిరంజన్​ రెడ్డి వివరించారు. వరి మినహా ఇతర పంటలకు ప్రోత్సాహం కొరవడి నష్టపోతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎమ్మెస్పీ మించి నువ్వులు, సెనగలు, పత్తి, వేరుశెనగ, కందులు, మినుములు తదితర పంటలు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

తీరు మార్చుకోవాలి: యాసంగిలో రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యంతో నూకలు ఎక్కువగా వస్తాయని నిరంజన్​ రెడ్డి అన్నారు. వీటిని కొనబోమని కేంద్రం చెబుతోందని.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సైతం ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు వెల్లడించారు. వానాకాలం ఎవరి ఇష్టం వారిదని... ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. కొందరు కురచబుద్ధితో తెలంగాణ విజయాలను మరుగున పడేసేందుకు.... రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... ఇప్పటికైనా తీరు మార్పుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి: DH: ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్‌ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్‌

దగ్గు టానిక్​కు బదులు 'పేల మందు'- ప్రాణాపాయంలో మహిళ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.