ETV Bharat / city

krishna Board: రేపటి కృష్ణా బోర్డు భేటీలో వాటాల లెక్క తేలేనా...?

author img

By

Published : Aug 31, 2021, 5:30 PM IST

తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా ఖరారు, ఇతర అంశాలే ప్రధాన ఎజెండాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna river management Board) కీలక సమావేశం బుధవారం జరగనుంది. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో వాటా పెరగాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోరుతుండడం, పరసర్ప ఫిర్యాదుల నేపథ్యంలో బోర్డు భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. అటు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు సంయుక్తంగా సమావేశం కానున్నాయి.

krishna Board
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో నదీ యాజమాన్య బోర్డు(Krishna river management Board) 14వ సమావేశం బుధవారం జరగనుంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో రేపు ఉదయం జరగనున్న భేటీలో బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొంటారు. 2021-22 నీటి సంవత్సరానికి కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా విషయమై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. విభజన జరిగినప్పటి నుంచి తాత్కాలిక అవగాహన మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య 34, 66 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరుగుతోంది.

నీటిని చెరిసగం వినియోగించుకోవాలి

అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కృష్ణా జలాల్లో దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం జరుగుతోందని... న్యాయపరమైన నీటికేటాయింపులు జరిగే వరకు నీటిని చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు కూడా తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్ తమ వాటా పెంచాలని కోరుతోంది. 70:30 నిష్పత్తిలో నీటిని వినియోగించుకోవాలని అంటోంది. కృష్ణా జలాల్లో వాటా పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో బుధవారం జరిగే భేటీలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

బోర్డు కార్యాలయం తరలింపు

ఒక సంవత్సరం కేటాయించిన వాటాలో మిగిలిన జలాలను మరుసటి ఏడాదికి లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన, వరద వచ్చినపుడు నీటి వినియోగం, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, వాటి డీపీఆర్​లు ఇవ్వడం, చిన్ననీటివనరులకు నీటి వినియోగం, ఏపీ గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున 45 టీఎంసీలు అధికంగా ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తి, బోర్డు నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయాల్సి ఉంది. విశాఖపట్నంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఏపీ విజ్ఞప్తి మేరకు అక్కడ కొన్ని భవనాలను పరిశీలించారు. అయితే అద్దెను భరించేందుకు ఏపీ సుముఖంగా లేదు.

రెండు బోర్డుల సంయుక్త సమావేశం

దీంతో బోర్డు తరలింపు అంశంపై కూడా రేపటి భేటీలో చర్చ జరగనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన అంశంతో పాటు రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలు కూడా కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రానున్నాయి. అటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై బుధవారం సాయంత్రం రెండు బోర్డుల సంయుక్త సమావేశం జరగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో రెండు బోర్డుల సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొంటారు. ఇదే అంశంపై గతంలో రెండు బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డు సమావేశాలకు తెలంగాణ హాజరు కాలేదు. ఏపీ ప్రతినిధులు మాత్రమే హాజరై తమ అభిప్రాయాన్ని తెలిపారు. రెండో షెడ్యూల్​లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ విభాగం, అధికారులు, సిబ్బంది వివరాలను ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే బోర్డులకు అందించింది.

ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలి

రేపు సాయంత్రం జరగనున్న ఉమ్మడి భేటీలో గెజిట్ అమలు కార్యాచరణపై చర్చిస్తారు. ఆర్నెళ్లలోగా నోటిఫికేషన్​ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిర్ధిష్ట గడువుతో కూడిన కార్యాచరణ ఖరారు చేయాల్సి ఉంది. రెండు రాష్ట్రాలు సంబంధిత సమాచారం, వివరాలు బోర్డులకు ఇవ్వాలి. రెండు రాష్ట్రాలు ఒక్కో బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున నగదును జమ చేయాల్సి ఉంది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తీసుకోవాల్సిందేనని, లేదంటే ఆ ప్రాజెక్టుల పనులను ఆపివేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్​లో కేంద్రం పేర్కొంది.

ఇదీ చదవండి: Bandi Sanjay: 'అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. సచివాలయం నిర్మిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.