ETV Bharat / city

బెయిల్​ వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్​ రెడ్డి అరెస్టు

author img

By

Published : Aug 7, 2020, 6:45 PM IST

Updated : Aug 7, 2020, 7:24 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైడ్రామా చోటుచేసుకుంది. కడప జైలు నుంచి బెయిల్​పై విడుదలైన 24 గంటల్లోపే జేసీ ప్రభాకర్​ రెడ్డి, జేసీ అస్మిత్​ రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. అట్రాసిటీ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెయిల్​ వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్​ రెడ్డి అరెస్టు
బెయిల్​ వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్​ రెడ్డి అరెస్టు

మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీఐ దేవేంద్రకుమార్‌తో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.

అట్రాసిటీ కేసులో అరెస్టు

వాహనాల రిజిస్ట్రేషన్‌ అక్రమాల కేసులో ఇటీవల జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టయ్యారు. 54 రోజుల రిమాండ్ అనంతరం గురువారం కడప జైలు నుంచి విడుదల అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి భారీగా తెదేపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కడపకు చేరుకుని, అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌ మధ్య జేసీ ప్రభాకర్​ రెడ్డి, జేసీ అస్మిత్​ రెడ్డిని తీసుకొచ్చారు. తాడిపత్రి పరిధిలోని బొందలదిన్నె గ్రామం వద్ద పోలీసులు అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వకపోవటంతో జేసీ అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. ఈక్రమంలో పోలీసులు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జేసీ వాహనం దిగి పోలీసులతో మాట్లాడగా.. అన్ని వాహనాలను అనుమతించారు. అయితే ఈ సమయంలో జేసీ ప్రభాకర్​ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని సీఐ దేవేంద్ర... డీఎస్పీ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్​లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో జేసీ ప్రభాకర్​ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి ఇంటి వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చినందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

బెయిల్​ వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్​ రెడ్డి అరెస్టు

హైడ్రామ నడుమ

షరతులతో కూడిన బెయిల్​పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో సంతకం చేసేందుకు వెళ్లారు. అయితే సంతకాలు పూర్తైనప్పటికీ వారిని పోలీస్ స్టేషన్​లో ఉంచారు అధికారులు. కొన్ని గంటల తరువాత ప్రభాకర్​ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాసేపటికే తాడిపత్రి పట్టణంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. సాయంత్రం దాదాపు ఆరు గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు.

మరో కేసు

మరోవైపు జైలు నుంచి విడుదల సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి

అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా: జేసీ ప్రభాకర్​

Last Updated : Aug 7, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.