ETV Bharat / city

ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా భాగ్యనగరం

author img

By

Published : Mar 17, 2020, 7:19 PM IST

hyderabad roads empty due to corona effect
ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ ప్రభావం తెలంగాణనూ భయపెడుతోంది. అప్రమత్తమైన సర్కార్​ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం, థియేటర్లు, పార్కుల మూసివేతతో హైదరాబాద్​ మహానగరంలో రద్దీ తగ్గింది. నిత్యం జనంతో కళకళలాడే పలు ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

కరోనా వైరస్​... ఈ పేరు చెబితే చాలు.. ప్రజలంతా వణికిపోతున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తోన్న ఈ వైరస్​పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన నేపథ్యంలో సర్కార్​ అప్రమత్త చర్యలు తీసుకుంటోంది. ముందస్తుగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశించింది.

బోసిపోయిన భాగ్యనగరం

కొవిడ్-19 వైరస్​ ప్రభావం భాగ్యనగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిత్యం జనంతో సందడిగా ఉండే నగరంలోని పలు ప్రాంతాలు బోసిపోయాయి. ఎప్పుడు రద్దీగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లు లేక వెలవెలబోయాయి. కరోనా వైరస్​ భయంతో బయట ఫుడ్​ తినాలనిపిస్తే ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసుకుంటున్నారు కానీ.. బయట అడుగుపెట్టడం లేదు.

నిర్మానుష్యంగా నగర రహదారులు

పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, షాపింగ్​, థియేటర్లకు వెళ్లే జనంతో ఎప్పుడు కిటకిటలాడే భాగ్యనగర రహదారులు ఇప్పుడు ఖాళీగా బిక్కుబిక్కుమంటున్నాయి. కొవిడ్-19 వైరస్​ నేపథ్యంలో నగరమంతా నిర్మానుష్యంగా మారింది. సాయంత్రం కాగానే జనంతో కిటకిటలాడే పర్యటక ప్రాంతాలు.. ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఓ విధంగా అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది.

అప్రమత్తమయినా.. ఆందోళన వీడట్లేదు

ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ సర్కార్​ కరోనా వ్యాప్తి నివారణకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజల్లో భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నా... వరుసగా పాజిటివ్​ కేసులు నమోదవుతుండటం వల్ల ఆందోళనకు గురై బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.